Advertisement

  • డిసెంబర్ లోగా వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లిన సీసీఎంబీ

డిసెంబర్ లోగా వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లిన సీసీఎంబీ

By: chandrasekar Fri, 23 Oct 2020 1:21 PM

డిసెంబర్ లోగా వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లిన సీసీఎంబీ


కరోనా వైరస్..2019 డిసెంబర్ నుంచి నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ..విజృంభిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాయి. డిసెంబర్ లోగా వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలపై ఇప్పుడు ఇండియాలోని సీసీఎంబీ నీళ్లు చల్లేసింది. వైరస్ తీవ్రత ఇంకా తగ్గలేదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా ఇప్పుడు ప్రపంచంలో రెండవ దేశంగా నిలిచింది. అమెరికా తరువాత అత్యధిక కేసులున్నది ఇండియాలోనే. మూడో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని అందరూ నమ్ముతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రేయింబవళ్లు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ కోసం ప్రపంచ దేశాల ప్రయత్నాలు కొన్ని విజయవంతమయ్యే దిశగా ఉన్నాయి. రష్యా ఇప్పటికే తొలి కరోనా వ్యాక్సిన్ సిద్దం చేశామంటూ ప్రకటించింది. అటు చైనా కూడా వ్యాక్సిన్ పంపిణీకు సన్నాహాలు చేస్తోంది. ఇండియాలో భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉంది. పలు దేశాల్లో తొలి దశ ప్రయోగాలను పూర్తి చేసుకుని చివరి దశ ప్రయోగాల్లో ఉంది వ్యాక్సిన్. లక్షలాది మందిని బలి తీసుకున్న మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమని కొందరు.. మరికొందరు వచ్చే యేడాది మార్చ్ నాటికి సిద్ధమని అంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియాకు చెందిన ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ సంచలన ప్రకటన చేసింది. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాలంటే మరో ఏడాది సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు సీసీఎంబీ సీఈవో మదుసూధన్‌రావు ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేసులు మాత్రమే తగ్గాయని తీవ్రత ఇంకా తగ్గలేదని అన్నారు. వైరస్‌ విజృంభణ ఇలానే కొనసాగితే మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ విధించక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్స్‌లలో ఏది ఏవిధంగా పనిచేస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలన్నీ కష్టపడుతున్నా.. అనుకున్నంత సులభంగా అందుబాటులోకి రాదన్నారు. సీసీఎంబీ సంస్థకున్న ప్రాధాన్యత, ప్రామాణికత దృష్ట్యా ఈ ప్రకటన ఇప్పుడు నిజంగానే ఆందోళన కలిగిస్తోంది.

Tags :
|

Advertisement