Advertisement

ఐపీయల్ స్పాన్సర్ పోటీలో బైజూస్ , అమెజాన్

By: Dimple Fri, 07 Aug 2020 5:09 PM

ఐపీయల్ స్పాన్సర్ పోటీలో బైజూస్ , అమెజాన్

ఓడలు బండ్లవడం,,, బండ్లు ఓడలవడం... అన్న సామెత ప్రస్తుతం బీసీసీఐకి సరిగ్గా సరిపోతుంది. కరోనా కారణంగా అసలు లీగ్ జరగుతుందా అనుకుంటే పూర్తి జాగ్రత్తలతో యుఏఈలో నిర్వహించేందుకు బోర్డు సిధ్ధమైంది. వచ్చే నెలలో సీజన్ కోసం ఏర్పాట్లు మొదలుపెడితే.. అనూహ్యంగా వివో టైటిల్ స్పాన్సర్ గా తప్పుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కొత్త స్పాన్సర్ కోసం అన్వేిషిస్తోన్న బీసీసీఐకి ఆ స్థాయిలో డీల్ రావడం కష్టత‌రంగా మారింది. పెద్ద స్పాన్స‌ర్ స్థానంలో త‌క్కువ ధ‌ర‌కు ద‌క్కించుకోడానికి బైజూస్‌, అమేజాన్‌, డ్రీమ్ ఎలెవ‌న్ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి.

ఐదేళ్ల వరకు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగేందుకు 2018లో బీసీసీఐతో వివో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున 2022 వరకు చెల్లిస్తుంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2020 దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్ ‌10 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. స్పాన్సర్లు తమతోనే ఉన్నారని స్పష్టం చేసింది. చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం తీవ్రంగా నడుస్తుండటంతో ఆ సెగ వివోకు తగలింది. దాంతో ఈ ఏడాది ఆ సంస్థ ఐపీఎల్‌లో భాగస్వామి కావడం లేదని బీసీసీఐ గురువారం ఏకవాక్య ప్రకటన జారీ చేసింది.


బీసీసీఐ ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత ధనిక బోర్డు... మిగిలిన బోర్డులు సంగతి ఎలా ఉన్నా ఆదాయ పరంగా భారత క్రికెట్ బోర్డుకు తిరుగులేదు. టెండర్లు ఆహ్వానించడమే ఆలస్యం కోట్లు కుమ్మరించేందుకు కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు క్యూ కట్టేవి. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత బీసీసీఐ పరిస్థితి రివర్సయినట్టు కనిపిస్తోంది. భారీగా ఆదాయం తెచ్చిపెట్టే ఐపీఎల్ ఎప్పుడైతే కరోనా కారణంగా వాయిదా పడింతో బీసీసీఐకి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు స్పాన్సర్లు కరువయ్యారు. దుబాయ్ లో లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా... ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ వివో లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బీసీసీఐ చైనా కంపెనీల విషయంలో సానుకూలంగానే ఉంది. ఒప్పందం ప్రకారం స్పాన్సర్లు కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో బీసీసీఐ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దేశప్రజలంతా చైనా వస్తువులను బహిష్కరిస్తే... బీసీసీఐ సొంత ప్రయోజనాల కోసం స్పాన్సర్ షిప్ కొనసాగిస్తుందంటూ పలువురు మండిపడ్డారు. ఈ విమర్శలకు బోర్డు పెద్దగా స్పందించకున్నా... వివో కంపెనీ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ కు దూరంగా ఉండడమే మంచిదని భావించింది. వివో నిర్ణయంతో షాక్ కు గురైన బీసీసీఐ ఇప్పుడు కొత్త స్పాన్సర్ వేటలో పడింది.


ఇదిలా ఉంటే ఫ్రాంచైజీలకు కూడా వివో నిర్ణయం పెద్ద షాకే ఇచ్చింది. కరోనా కారణంగా లీగ్ కు అభిమానులను అనుమతించే పరిస్థితి లేకపోవడంతో ఫ్రాంచైజీలు గేట్ రెవెన్యూను కోల్పోనున్నాయి. ప్రతీ సీజన్ కూ ఒక్కో ఫ్రాంచైజీ 22 నుంచి 25 కోట్ల వరకూ గేట్ రెవెన్యూ అందుకునేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కోల్పోనుండగా.. బీసీసీఐ కూడా నష్టపరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తోంది. దీనికి తోడు టైటిల్ స్పాన్సర్ గా వివో తప్పుకోవడంతో ఫ్రాంచైలకు మరింత నష్టం వాటిల్లనుంది. టైటిల్ స్పాన్సర్ గా ఉన్న వివో ఏడాదికి 440 కోట్ల చెల్లిస్తుండగా... సెంట్రల్ పూల్ ద్వారా ఒక్కో ఫ్రాంచైజీకి 28 కోట్ల వరకూ వాటా దక్కేది. ఇప్పుడు వివో స్థానంలో కొత్త స్పాన్సర్ వచ్చినా ఒప్పందం మాత్రం అంతటి భారీస్థాయిలో ఉండే అవకాశం లేదు. కోవిడ్ ప్రభావంతో వివో చెల్లించిన మొత్తంలో సగానికైనా డీల్ కుదిరితే గొప్పేనని విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ వచ్చినా ఫ్రాంచైజీలు గతంలో కంటే సగం వాటా కోల్పోనున్నాయి. అదే సమయంలో ఈ సారి విదేశాల్లో సీజన్ నిర్వహిస్తుండడంతో ప్రతీ ఫ్రాంచైజీకి ఖర్ఛులు బాగా పెరగనున్నాయి. ఆటగాళ్ళను తీసుకెళ్లేందుకు చార్టెడ్ ఫ్లైట్స్ , భౌతిక దూరం పాటించాల్సిన దష్ట్యా హోటల్స్ లో ఎక్కువ గదులు బుక్ చేయనుండం, అన్నింటి కంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు కోవిడ్ టెస్టులు చేయాల్సి రావడం, బయోసెక్యూర్ బబూల్ నిర్వహణ... ఇలా ఖర్ఛు భారీగానే ఉండనుంది. ఒకవైపు ఆదాయం పడిపోగా.. మరోవైపు ఖర్ఛు పెరగడం ఖాయమవడంతో ఫ్రాంచైజీలకు ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ఏడాదికి లీగ్ జరిగి.. కొన్ని లాభాలతో బయటపడదామని భావించిన ఫ్రాంచైజీలు... ఇప్పుడు లీగ్ జరిగితే వచ్చే నష్టాల గురించి ఆలోచిస్తూ తలపట్టుకుంటున్నాయి

Tags :
|
|
|

Advertisement