Advertisement

  • భారత అమ్ములపొదిలో మరొక అస్త్రం ..బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

భారత అమ్ములపొదిలో మరొక అస్త్రం ..బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

By: Sankar Sun, 18 Oct 2020 3:46 PM

భారత అమ్ములపొదిలో మరొక అస్త్రం ..బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం


రక్షణ రంగంలో భారత్‌ మరో మైలురాయిని దాటింది. అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష ఆదివారం విజయవంతమైంది. మిస్సైల్‌ పిన్‌ పాయింట్‌ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ తెలిపింది.

బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను భారత్‌, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక 2016 నుంచి తన నౌకాదళానికి సేవలు అందజేస్తోంది. ఇండియన్‌ నేవీ ప్రాజెక్టు 15ఏలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేతుల మీదుగా నౌకదళానికి అప్పగించారు. మొత్తం 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ చెన్నై బహుళ ప్రయోజనాలున్న రెండు యుద్ధ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు.

ఇది గంటలకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి. సెప్టెంబరు 20 కూడా విస్తృత శ్రేణికి చెందిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ప్రయోగం నిర్వహించారు.

డీఆర్‌డీఓ పరీక్షించిన మిస్సైల్‌ 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను మాక్‌ 2.8 వేగంతో వెళ్లి ఛేదిస్తుంది. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌, ఇండియన్‌ నేవీని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.

Tags :
|

Advertisement