Advertisement

  • తెలంగాణ సర్కార్ ఫై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ సర్కార్ ఫై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

By: chandrasekar Thu, 23 July 2020 11:13 AM

తెలంగాణ సర్కార్ ఫై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని, ఆయన సోమరిపోతుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో దారుణమైన వైద్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.

బుధవారం బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్‌ ప్లాంట్ పని చేయడం లేదని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ హైకోర్టును ధిక్కరించే పరిస్థితి రావటం దారుణమని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల ప్రాణాల గురించి రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించినా ముఖ్యమంత్రి స్పందించకపోవటం అన్యాయమని ధ్వజమెత్తారు.

కార్పోరేట్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమస్య చిన్నదిగా చూపించి సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశాఖ సైతం తప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోందని ఆరోపించారు. జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల వివరాల విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని, దీనివల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోందని మండిపడ్డారు.

ఫాంహౌస్, ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది విధులకు రావడానికి భయపడుతున్నారని బండి సంజయ్ తెలిపారు.

ఖాళీగా ఉన్న పోస్టుల్లో వైద్య సిబ్బందిని నియమించాలని, శ్మశానవాటికలో సీసీటీవీ కెమెరాలు పెడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Tags :

Advertisement