Advertisement

  • కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూయిస్తున్నారు..ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూయిస్తున్నారు..ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

By: Sankar Mon, 06 July 2020 9:52 PM

కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూయిస్తున్నారు..ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్



కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. పరీక్షలు చేయమని చెప్పినా చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ధన్వి హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు రోగనిరోధక శక్తిని పెంచే మందులను అందించారు. జర్నలిస్టులకు మాస్కులు, గొడుగులను పంపిణీ చేశారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాలు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను పాటిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, చేతకానితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలుంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ప్రైవేటు ప్రయోగశాలలకు ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రయోగశాలల్లో టెస్టులు చేస్తే ప్రభుత్వం యాజమాన్యాలను బెదిరిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులకు సరైన సౌకర్యాలు లేవని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియంత్రణలో ఆ శాఖ లేదని విమర్శించారు. ప్రతి దానికీ ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైద్య, రాష్ట్ర అధికారులు విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్లలో కొవిడ్‌ కేసుల సంఖ్యలో తేడా ఉంటోందని పేర్కొన్నారు.కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌లో చేరాలని డిమాండ్‌ చేశారు.


Tags :
|
|
|

Advertisement