Advertisement

  • మూడు రాజధానుల ఏర్పాటుకు బిల్లు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

మూడు రాజధానుల ఏర్పాటుకు బిల్లు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

By: chandrasekar Mon, 20 July 2020 2:11 PM

మూడు రాజధానుల ఏర్పాటుకు బిల్లు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ


అధికార పార్టీ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. తాజాగా సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. తాజాగా, ఈ బిల్లులను ఆమోదించవద్దని, దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ రాశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని ఆమోదించవద్దని కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాశారు.

ఈ రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిందని, ఆ సమయంలో వాటిని ఆమోదించడం సరికాదని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా ఆర్థిక సహాయం అందజేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. రాజధానిని తరలించడం వల్ల అమరావతి ప్రాంత రైతులు నష్టపోతారని అన్నారు. ప్రజలు ఎవరూ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన వికేంద్రీకరణ బిల్లు తదితర బిల్లులకు ఆమోదం తెలుపవద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని వివరించారు. ఏపీ విభజన చట్టంలో ఒక్క రాజధానినే మాత్రమే పేర్కొన్నారని, కేంద్రం కూడా దీనికి నిధులు అందజేసిందని తెలిపారు. దీనిపై రాజ్యాంగపరంగా ముందుకెళ్లాలని కోరారు. ఈ బిల్లులపై ప్రజలు, రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.

మూడు రాజధానుల అంశంపై బీజేపీ నేతల్లో భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సహా సుజనా చౌదరి వంటి కొందరు నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు, రాయలసీమకు చెందిన కొందరు నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు.

Tags :
|

Advertisement