Advertisement

బీహార్ రెండో దశ పోలింగ్‌ ప్రారంభం...

By: chandrasekar Tue, 03 Nov 2020 11:22 AM

బీహార్ రెండో దశ పోలింగ్‌ ప్రారంభం...


నేడు (నవంబరు 3న) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... గతవారం (అక్టోబరు 28న) 71 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత పొలింగ్ 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ స్థానాల్లో జరగనుంది. ఈ సెగ్మెంట్లలో మొత్తం 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వారి భవితవ్యాన్ని 2.85 కోట్ల మందికిపైగా ఓటర్లు ఖరారు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పటిష్టమైన కరోనా నిబంధనల నడుమ పోలింగ్ ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ రెండో దశ పోలింగ్‌లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులు, సినీ నటుడు శత్రఘ్నసిన్హా తనయుడు లవ్‌సిన్హా తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. లాలూ కుటుంబానికి మొదటనుంచి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్, సమస్తిపూర్‌ నుంచి తేజస్వీ సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 146 మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇదిలాఉంటే.. బీహార్ రెండో విడత ఎన్నికలతోపాటు.. దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా మంగళవారం ఉపఎన్నికలు జరుగనున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌‌లో అత్యధికంగా 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతోపాటు గుజరాత్‌లో 8, యూపీలో 7, ఒడిశాలో 2, నాగాలాండ్‌లో 2, కర్ణాటక 2, జార్ఖండ్‌లో 2, తెలంగాణలో 1 (దుబ్బాక), ఛత్తీస్‌గఢ్లో 1, హర్యానాలో 1 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీహార్‌లో తుది విడత పోలింగ్ 7వ తేదీన జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement