Advertisement

  • ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు... ఎవరెంత తెలుసా..?

ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు... ఎవరెంత తెలుసా..?

By: Anji Thu, 22 Oct 2020 8:21 PM

ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు... ఎవరెంత తెలుసా..?

భారీ వరదల కారణంగా అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. సీఎం కే.చంద్రశేఖర రావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు.

చిరంజీవి, మహేశ్‌బాబు, నాగార్జున, జూ.ఎన్టీయార్ తదితరులు ఇదివరకే భారీ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరికొందరు వ్యాపార, వాణిజ్య, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు.

రామోజీ గ్రూప్ సంస్థల తరపున చైర్మన్ రామోజీరావు 5 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నర్సింహా రెడ్డి, మల్లేశం మునిసిపల్ మంత్రి కే. తారకరామారావును కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందించారు.

వారి సమక్షంలోనే రామోజీరావుకు కాల్ చేసిన కేటీఆర్.. ధన్యవాదాలు తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కోటి రూపాయలను, యశోద హాస్పిటల్ యాజమాన్యం మరో కోటి రూపాయలను సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు.

వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫున సంస్థ ఫౌండర్, ఛాన్స్‌లర్ జి.విశ్వనాథ్ తన ప్రతినిధి ద్వారా కోటి రూపాయలను సీఎంఆర్‌ఎఫ్‌కు అందించారు. మెడికవర్ హాస్పిటల్ తరఫున 50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

ప్రముఖ సినీ నటుడు పోతినేని రామ్ ఇరవై ఐదు లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌కు చెక్కును అందించారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన శ్రీనివాస్ ఆగ్రో ప్రొడక్ట్స్ తరఫున 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి, విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Tags :
|

Advertisement