Advertisement

  • నోటికి చిక్కితే చిరుతపులైనా సరే.. దానికి ఆహారంగా మారిపోవాల్సిందే...!

నోటికి చిక్కితే చిరుతపులైనా సరే.. దానికి ఆహారంగా మారిపోవాల్సిందే...!

By: Anji Sat, 26 Dec 2020 6:11 PM

నోటికి చిక్కితే చిరుతపులైనా సరే.. దానికి ఆహారంగా మారిపోవాల్సిందే...!

20 అడుగుల పొడవు. 750 కేజీల బరువు. నోటికి చిక్కితే చిరుతపులైనా సరే.. దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అవే నైలు నదిలో కనిపించే మొసళ్లు. మనుషుల్ని, మృగాల్ని.. ఆమాటకొస్తే.. చిన్నపాటి ఇతర మొసళ్లను కూడా ఇవి వదలవు.

అంతటి భయంకరమైన జీవులివి. వాటి రూపం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా సరే.. వాటి దరిదాపులకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ప్రాణాల మీద ఆశ లేదనుకుంటేనే సమీపంలోకి వెళ్తారు.

ఈమధ్యనే నీళ్లు తాగడానికి వచ్చిన ఓ చిరుతపులిని చటుక్కున నోట కరుచుకుని.. లటుక్కున నీటిలోకి మునిగిపోయింది ఓ నైలు నది మొసలి. ఆఫ్రికాలో జరిగిన ఈ ఘటన బాగా వైరల్ అయ్యింది.

దీంతో అసలీ మొసళ్లు ఎలా ఉంటాయి.. వాటి జీవనశైలి ఎలాంటిది అని చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంది. నైలునది మొసళ్ల గురించి ఒక్కో విషయం తెలుసుకుంటున్న కొద్దీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

నైలు నది మొసళ్ల నోట చిక్కి ఏటా వందలమంది చనిపోతుంటారు. అయినా వాటిని ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. ఎందుకంటే అవేమీ చిన్నవి కావు. ఆఫ్రికాలోనే అతి పొడుగైన నైలునది మొసళ్లు 20 అడుగుల వరకు పెరుగుతాయి.

అంటే ముగ్గురి నుంచి నలుగురు మనుషులను ఒకరిపై మరొకరిని నిల్చోబెడితే ఎంత పొడుగుంటారో అంత పొడుగుంటుంది ఒక్కో మొసలి. ఇక అలాంటప్పుడు దానిపై ఎదురుదాడి చేయడం అనేది కలే అవుతుంది.

దీని బరువు 1650 పౌండ్లు ఉంటుంది. అంటే దాదాపు 750 కేజీల బరువు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ముప్పావు టన్ను ఉంటుంది. అంతటి బరువైన మొసలి మీద పడితే.. ఆ బరువుకే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక దానితో పోరాటం చేయడం అంటే అది ఊహకందని విషయం.

సాధారణంగా చూసుకుంటే.. ఈ మొసళ్లు 16 అడుగుల పొడవు, 227 కేజీల బరువు ఉంటాయి. ఇవి ఆఫ్రికాతో పాటు నైలు నది పరిసరాల్లోనూ, మడగాస్కర్ లోని నదుల్లోను, చిత్తడి నేలల్లోను, మడ అడవుల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవి ఎక్కువగా చేపలను తింటాయి. వీటితోపాటు తన సమీపంలోకి వచ్చే ఏ జంతువునూ విడిచిపెట్టవు. ముందే చెప్పుకున్నాం కదా.. చిరుతపులిని కూడా చట్టుకున నోట కరుచుకుని భోంచేస్తుంది అని.

జీబ్రాలు, చిన్నసైజు హిప్పోలు, పక్షులు, ఇతర మొసళ్లు, పోర్కుపైన్స్ (ఒంటినిండా ముల్లున్న జంతువు), ఇంకా రాబందులు, గద్దలు, నక్కలు వంటి ఇతర జంతువులను కూడా తన పదునైన పళ్లతో కరకరా నమిలేస్తాయి.

నైలు మొసళ్లు ఇంతటి క్రూరమైనవే అయినా.. వీటికో మంచి లక్షణం కూడా ఉంది. అది.. తల్లిదండ్రులుగా ఇవి నిర్వహించే బాధ్యతే. చాలా వరకు సరీసృపాలు.. ఒకచోట గుడ్లు పెట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

కానీ ఈ నైలు మొసళ్లు మాత్రం గుడ్లు పెట్టిన తరువాత వాటికి కచ్చితంగా కాపలా ఉంటాయి. పైగా ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా నోట్లోకి తీసుకుంటాయి. దాని ద్వారా గుడ్లను పొదగడం వాటికి సులభమవుతుంది.

Tags :
|
|

Advertisement