Advertisement

సన్ రైజర్స్ కు షాక్ ...గాయంతో స్టార్ బౌలర్ దూరం

By: Sankar Tue, 06 Oct 2020 10:31 AM

సన్ రైజర్స్ కు షాక్ ...గాయంతో స్టార్ బౌలర్ దూరం


ఐపీఎల్‌లో ఇప్పటికే తడబడుతూ ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌ ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు.

‘తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్‌ ఇక ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. అది గ్రేడ్‌–2 లేదా గ్రేడ్‌–3 స్థాయి గాయం కావచ్చు. దీని వల్ల కనీసం 6–8 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లేనట్లే’ అని ఆయన వెల్లడించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ భువనేశ్వర్‌కు గాయమైంది. అతని తొడ కండరాలు పట్టేయడంతో ఒక బంతి మాత్రమే వేసి తప్పుకున్నాడు.

ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టిపడేయడంతో పాటు డెత్‌ ఓవర్లలో కూడా పరుగులు నియంత్రించగల, అనుభవజ్ఞుడైన భువీ దూరం కావడం హైదరాబాద్‌ టీమ్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లలో 3 వికెట్లే తీసినా... కేవలం 6.8 ఎకానమీతో పరుగులివ్వడం భువీ విలువేమిటో చూపిస్తుంది.

Tags :
|

Advertisement