Advertisement

ఉపాధ్యాయుడిగా ఉండి ఘరానా దొంగగా అవతారం

By: chandrasekar Sat, 15 Aug 2020 10:49 AM

ఉపాధ్యాయుడిగా ఉండి ఘరానా దొంగగా అవతారం


ఉపాధ్యాయుడిగా ఉండి ఘరానా దొంగగా అవతారం మెత్తిన ఒక వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ పదేండ్ల కిందట ఘరానా దొంగగా మారాడు. జైలులోనే నేరగాళ్లతో దోస్తీ చేసి దొంగల ముఠాను తయారు చేశాడు. తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గ్యాంగ్‌ సభ్యులతో కలిసి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓ దొంగతనానికి ప్రయత్నిస్తుండగా శంషాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఈ గ్యాంగ్‌ పట్టుబడింది. ఈ దొంగల ముఠా లీడర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కొసూరి శ్రీనివాసరావు 10ఏండ్ల కిందట కల్వకురి ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే ఉదయ్‌కుమార్‌ అటెండర్‌గా పనిచేశాడు. 2009లో ఉదయ్‌కుమార్‌ తన సోదరుడు యోగిందర్‌కుమార్‌ దొంగిలించిన చోరీ సొత్తును శ్రీనివాసరావు ద్వారా కుదువపెట్టించాడు. ఈ విధంగా దొంగ సొత్తును తాకట్టు పెట్టించడం, దొంగతనం చేసిన వారికి బెయిల్‌ ఇప్పించడం చేస్తూ చివరకు శ్రీనివాసరావు కూడా దొంగగా మారాడు. దొంగలకు బెయిల్‌ ఇప్పించడం, పోలీసులకు చిక్కకుండా వాళ్లకు కావాల్సిన షెల్టర్‌ ఇచ్చి దొంగతనాలు చేయిస్తూ గ్యాంగ్‌ను నిర్వహించాడు. కాల క్రమేణ ముఠాను ఏర్పరుచుకుని చాలా దొంగతనాలకు పాల్పడ్డాడు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో 2009 సంవత్సరం నుంచి 48దొంగతనాలు చేశాడు. గత కొంత కాలం కిందట ఒంగోలు పోలీసులకు పట్టుబడటంతో జైలుకు పంపించారు. ఒంగోలు జైలు నుంచి జూలై 16న బెయిల్‌ పై విడుదలయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన మల్లచెర్వు రామారావు 2011నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 47దొంగతనాలు చేసి ఒంగోలు జైలుకు వెళ్లాడు. ప్రకాశం జిల్లాకు చెందిన చింతల సిసింద్రీ 2014 నుంచి 20 దొంగతనాలు చేసి ఒంగోలు జైలుకు వెళ్లాడు. అలాగే వనపర్తి జిల్లా వీపనగండ్ల నాగర్ల తాండకు చెందిన రత్నాలవత్‌ శంకర్‌నాయక్‌ దొంగతనాలు చేయడంలో నేర్పరి. 2012నుంచి ఏపీ, తెలంగాణలో 51 దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడటంతో ఒంగోలు జైలుకు తరలించారు.

ఈ నలుగురు కలిసి జైలులోనే ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. జూలై నెలలో ఒంగోలు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన మువ్వ సురేశ్‌బాబు, గ్యాంగ్‌ లీడర్‌ శ్రీనివాస్‌రావుకు గుంటూరు జైలులో పరిచయమయ్యాడు. అతడు కూడా ఈ గ్యాంగ్‌లో కలిసిపోయాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఈ దొంగల గ్యాంగ్‌కు చోరీలు చేయడానికి కావాల్సిన స్క్రూ‌ డ్రైవర్‌, రాడ్‌ వంటి పరికరాలను శ్రీనివాసరావు సమకూర్చాడు. గ్యాంగ్‌లీడర్‌ సూచనలతో ద్విచక్ర వాహనంపై ఒకరిద్దరు సభ్యులు రాత్రి వేళల్లో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తిస్తారు. లక్ష్యంగా ఎంచుకున్న ఇంట్లో దొంగతనం చేస్తారు. సైబరాబాద్‌ పరిధిలోని షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, రాయదుర్గంతో పాటు మహబూబ్‌నగర్‌లోను ఈ ముఠా దొంగతనాలు చేసింది.

ఈ గ్యాంగ్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు సిద్ధమవుతుండగా గ్యాంగ్‌పై శుక్రవారం శంషాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా నుంచి 17.5తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు, ఒక హోండా యాక్టివా, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య బృందాన్ని సీపీ అభినందించారు. ఈ సమావేశంలో క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు ఈ ముఠా చాలా రకాలుగా చేసిన దొంగతనాలు వివరాలన్నీ రాబట్టారు.

Tags :
|

Advertisement