Advertisement

  • ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్ మరియు వేదికల్ని ప్రకటించిన బిసిసిఐ

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్ మరియు వేదికల్ని ప్రకటించిన బిసిసిఐ

By: chandrasekar Mon, 26 Oct 2020 5:09 PM

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్ మరియు వేదికల్ని ప్రకటించిన బిసిసిఐ


ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ వేదికల్ని బిసిసిఐ ప్రకటించింది. లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. నవంబరు 3 వరకూ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా ఒక్క రోజు గ్యాప్‌తో నవంబరు 5 నుంచి ప్లేఆఫ్ మ్యా‌చ్‌లు జరగనున్నాయి. ఫైనల్ తేదీని గతంలోనే షెడ్యూల్‌లో ప్రకటించిన బీసీసీఐ ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరిగే వేదికలపై మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోయింది. అయితే తాజాగా లీగ్ దశ మ్యాచ్‌లు మరో వారంలో ముగియనుండటంతో ప్లేఆఫ్, ఫైనల్ జరిగే వేదికల్ని ప్రకటించింది. నవంబరు 5న దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా నవంబరు 6న అబుదాబిలో ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు గ్యాప్‌లో నవంబరు 8న క్వాలిఫయర్-2 మళ్లీ అబుదాబిలోనే జరగనుంది. ఇక ఆఖరిగా నవంబరు 10న దుబాయ్ వేదికగా ఫైనల్‌ని నిర్వహించనున్నారు.

మాములుగా శని లేదా ఆది వారాల్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. కానీ ఈ సారి 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ వీకెండ్‌లో కాకుండా వీక్ మధ్యలో మంగళవారం జరగడం ఇదే తొలిసారి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4 నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. తొలుత పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో తలపడనుండగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. ఇక పట్టికలో 3,4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో ఆడనుండగా ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి వెళ్లనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్టు ఒకవేళ క్వాలిఫయర్-1లో ఓడినా క్వాలిఫయర్-2లో ఆడటం ద్వారా ఫైనల్‌కి చేరే మరో అవకాశం ఇస్తారు. మరి ఈ సారి ఐపీల్ 2020 కప్ ఎవరు గెలుచుకోనున్నారో వేచి చూడాల్సిందే.

Tags :
|

Advertisement