Advertisement

నటులకి తగ్గట్టు గాత్రం మార్చి పాడగల బాలు

By: chandrasekar Sat, 26 Sept 2020 09:02 AM

నటులకి తగ్గట్టు గాత్రం మార్చి పాడగల బాలు


చాల మంది నటులకు తగ్గట్టు గాత్రం మార్చి పాడడంలో బాలసుబ్రమణ్యం చాలా నేర్పరి. అసలు ఎలా ఈ విధంగా రకరకాల స్వరాలతో పడగలరని అందరికి ఆశ్చర్యం. ఇలా బాలు గొంతు చేసిన మిమిక్రీ మ్యాజిక్‌ అద్భుతం. కమెడియన్లకు పాడడం ఒకెత్తు అయితే అక్కినేని, ఎన్టీఆర్‌ లాంటి అగ్ర కథానాయకులకు పాడినప్పుడు వారి గాత్రమే అనిపించేలా పాడి మెప్పించడం మరొక ఎత్తు. ఆ ఫీట్‌ను అలవోకగా చేసి చూపించారు బాలు. ‘ముద్దుల కొడుకు’ సినిమాలో ‘దగాలు చేసి దిగాలు పడ్డ దసరా బుల్లోడా’ పాటలో మద్యం మత్తులో ఉన్న ఏఎన్నార్‌లా చెప్పిన డైలాగులు విన్న అక్కినేని ‘ఏంటి నాకు డబ్బింగ్‌ కూడా చెప్తారా’ అని బాలును సరదాగా అడిగారట! ఈ గొంతులు మార్చే విద్య గురించి అడిగినప్పుడు అల్లురామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు వంటివారి గొంతులో ఒకరకమైన ప్రత్యేకత ఉంటుందని అందుకే వారికి పాడుతున్నప్పుడు వారికి దగ్గరగా పాడడానికి ప్రయత్నించానని, ప్రయత్న పూర్వకంగా తాను గాత్రం మార్చి పాడింది మాత్రం ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌కేనని బాలునే స్వయంగా చెప్పారు.

వారికి తగ్గట్టు గాత్రం మార్చి పాడడం అప్పటి పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌కు ఘంటసాల మాస్టారే పాడాలని అందరూ అనుకునేవారు. ‘‘పెద్దవాళ్ల చేత ఒప్పించుకుని వారికి పాడాలంటే నేను ఘంటసాలగారిలాగానే పాడాలి. లేదా ఆ ఇద్దరి గాత్రానికి దగ్గరగా పాడగలగాలి. మాస్టారిలాగా ఎలాగూ పాడలేను నేను. ఆ గాత్రం ఆయనకు భగవంతుడిచ్చినవరం. అందుకే వీళ్ల గొంతుకు దగ్గరగా పాడే ప్రయత్నం చేశాను. అన్నీ కలిసొచ్చాయి కాబట్టి నా ప్రయత్నం ఫలించింది’’ అని బాలు తెలిపారు. ఆ తర్వాతి తరం హీరోలెవరికీ తాను గాత్రం మార్చలేదని వారందరికీ తన గాత్రం అలా కుదిరిపోయిందని వివరించారు. తెలుగులోనే కాక రాధా రవి, జనక్‌రాజ్‌ వంటివారికి తగినట్టుగా గొంతు మార్చి పాడి తమిళుల చేతా జేజేలు కొట్టించుకున్నారు. ‘ఇది కథ కాదు’ సినిమాలో ‘అటు ఇటు కాని హృదయముతోటి’, ‘తకధిమి తక’, ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో ‘నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు’ తదితర పాటల్లో బాలు ప్రదర్శించిన ప్రతిభ అనితర సాధ్యం. ఇలా చాలా భాషల్లో అయన రకరకాల గొంతులతో స్వరాలను అందించారు. అయన లేకున్నా అయన స్వరం మాత్రం ఎప్పుడు ఈ ప్రపంచంలో జీవించి ఉంటుంది.

Tags :
|

Advertisement