Advertisement

కరోనా వల్ల బజాజ్ ఆటోకు కష్టాలు

By: chandrasekar Wed, 08 July 2020 6:17 PM

కరోనా వల్ల బజాజ్ ఆటోకు కష్టాలు


పలు సంస్థలు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా నష్టాల ఊబి నుంచి కోలుకోలేకపోతున్నాయి. ప్లాంట్ తెరిచిన తర్వాత కూడా ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటోకు కష్టాలు తప్పడం లేదు. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ కరోనా కోరల్లో చిక్కుకుంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు ప్లాంట్ కి వచ్చి పని చేయాలంటే భయపడుతున్నారు.

మహారాష్ట్రలోని వాలూజ్, చకన్ వద్ద బజాజ్ ఆటోకు రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ వద్ద మరో ప్లాంట్ ఉంది. వాలూజ్ ప్లాంట్ లో ప్లాటినా, సిటి 100, బాక్సర్ 150 తో పాటుగా త్రిచక్ర వాహనాలు కూడా తయారుచేస్తారు. ఎనిమిది వేల మందికి పైగా కార్మికులు వాలూజ్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ లోనే కార్మికులకు కరోనా సంకటంగా తయారైంది.

కరోనా కారణంగా ఇప్పటివరకు ఈ ప్లాంట్ లో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. బజాజ్ ఆటోకు సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ లో 400 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కార్మికులు పని చేయాలంటే భయపడుతున్నారు. ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.

8 నుండి 10 రోజులపాటు కరోనా వైరస్ సైకిల్ ను విచ్ఛిన్నం చేయడానికి ప్లాంట్లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.

ప్లాంట్ ను మూసి వేయడం వల్ల ఉత్పత్తి నష్టం జరిగితే, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తరువాత అదనపు పనిగంటలు కేటాయించమని కోరుతున్నామని కూడా వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు బజాజ్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మొన్నటి వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ తో మూతపడిన ప్లాంట్, ప్రస్తుతం కరోనా కేసులతో మరోమారు తాత్కాలికంగా మూత పడటానికి సిద్ధంగా ఉంది.

Tags :
|
|
|

Advertisement