Advertisement

  • కంప్యూటర్ల హ్యాకింగ్ తో వ్యాక్సిన్ దొంగిలించే ప్రయత్నాలు

కంప్యూటర్ల హ్యాకింగ్ తో వ్యాక్సిన్ దొంగిలించే ప్రయత్నాలు

By: chandrasekar Mon, 07 Sept 2020 5:36 PM

కంప్యూటర్ల హ్యాకింగ్ తో వ్యాక్సిన్ దొంగిలించే ప్రయత్నాలు


కరోనా వ్యాక్సిన్‌ను ఎవరు ముందుగా సృష్టించి మార్కెట్లోకి తెస్తే వారిదే ఆధిపత్యం. వాళ్లకే లక్షలకోట్ల వ్యాపారం సొంతం. అందుకే చిన్నాచితకా దేశాలు కూడా వ్యాక్సిన్‌ కోసం శక్తికిమించిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడే చాలా దేశాలు అతి తెలివి ప్రదర్శిస్తున్నాయి. వందలకోట్లు ఖర్చుపెట్టి రాత్రి పగలు కష్టపడి వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు చేసే బదులు ఇతరుల నుంచి దానిని కొట్టేస్తే సరిపోతుందను కొ౦టున్నాయి అగ్రరాజ్యాలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాయి. ఆచరణలోకి కూడా దిగాయి. ఫార్మా కంపెనీలు, విద్యాసంస్థలే లక్ష్యంగా భారీ ఎత్తున కంప్యూటర్‌ హ్యాకింగ్‌ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా, రష్యా మినహా దాదాపు అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిజేస్తూనే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఆగస్టులో వ్యాక్సిన్‌ తయారుచేసినట్టు రష్యా ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ కూడా తుది దశలో ఉన్నదని చైనా వెల్లడించటంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హ్యాకింగ్‌ ద్వారా ఇతర దేశాల పరిశోధన ఫలితాలను తస్కరించాయని రష్యా, చైనాపై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని గూఢచర్య సంస్థల్లో పనిచేసిన, చేస్తున్న నిపుణులు తెలియచేసారు.

వ్యాక్సిన్‌ తస్కరణలో చైనా అతి తెలివి ప్రదర్శించిందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ వర్గాలు అంటున్నాయి. డబ్ల్యూహెచ్‌వో నుంచే ఆ దేశం వ్యాక్సిన్‌ పరిశోధన వివరాలు కొట్టేసిందని చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సిన్‌ పరిశోధన వివరాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్‌వోకు అందజేస్తూ ఉంటాయి. అది వాటిని పరిశీలించి ప్రజల ముందు పెడుతుంది. కానీ పరిశోధన వివరాలను డబ్ల్యూహెచ్‌వో బయటపెట్టడానికి ముందే చైనా అక్రమంగా ఆ వివరాలను సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాతోపాటు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, వ్యాక్సిన్‌ తయారీలో కీలకంగా ఉన్న గిలీడ్‌ సైన్సెస్‌, నోవావాక్స్‌, మోడెర్నా ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్లు పలు దఫాలుగా సైబర్‌ దాడులు చేశారని, వ్యాక్సిన్‌కు సంబంధించి కొంత సమాచారాన్ని కూడా దొంగిలించారని అమెరికా ఆరోపిస్తున్నది.

చైనా హ్యాకర్ల దాడులతో అప్రమత్తమైన అమెరికా నిఘా సంస్థలు కౌంటర్‌ హ్యాకింగ్‌కు తెరలేపాయి. ప్రత్యర్థి హ్యాకర్ల ప్రయత్నాలను గుర్తించి వారిని తమ ఉచ్చులోకి లాగటం అన్నమాట. ఇలా వారి వద్ద ఉన్న డేటాను అమెరికా హ్యాకర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ప్రయత్నాల్లో కొన్నిసార్లు విజయం సాధించే అవకాశం ఉన్నదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు తెలియచేసారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లుగా ప్రకటించిన తొలి దేశం రష్యా. కానీ రష్యా హ్యాకింగ్‌ ద్వారా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధన ఫలితాలను తస్కరించి వ్యాక్సిన్‌ తయారుచేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థపై రష్యా హ్యాకర్ల దాడిని బ్రిటిష్‌ ఎలక్ట్రానిక్‌ సర్వేలెన్స్‌ ఏజెన్సీ కనిపెట్టింది.



Tags :

Advertisement