Advertisement

  • అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా

By: Sankar Sun, 14 June 2020 11:00 PM

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా



కరోనా కారణముగా నిలిచిపోయిన రవాణా వ్యవస్థ ఇప్పుడిపుడే మళ్ళీ గాడిలో పడుతుంది..దాదాపు రెండు నెలలకు పైగానే డిపోలకే పరిమితం అయిన బస్సులు గత కొద్దీ రోజులుగానే మళ్ళీ రోడ్డు ఎక్కాయి ..అయితే కేవలం రాష్ట్రము లోపల మాత్రమే తిరుగుతున్న బస్సులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది .. దీంతో ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

తొలుత పరిమిత సంఖ్యలో బస్సులను నడపనుంది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. సోమవారం ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లను ప్రారంభించనుంది. బస్సుల్లో భౌతిక దూరం, విధిగా మాస్కులు, శానిటైజర్‌ వాడకం తప్పనిసరి.

అలాగే కర్ణాటక నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ప్రొటోకాల్‌ పాటించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేసింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు.


Tags :
|
|
|

Advertisement