Advertisement

  • ఏటా రూ.260 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్న ఏపీఎస్ఆర్టీసీ...

ఏటా రూ.260 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్న ఏపీఎస్ఆర్టీసీ...

By: chandrasekar Fri, 13 Nov 2020 12:30 PM

ఏటా రూ.260 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్న ఏపీఎస్ఆర్టీసీ...


లాక్‌డౌన్‌కు ముందు పొరుగు రాష్ట్రానికి వెయ్యికి పైగా బస్సులు తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు 638కి తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇందుకు భిన్నంగా మన రాష్ట్రంలో తెలంగాణ బస్సుల సంఖ్యను 746 నుంచి 822కు పెంచుకుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో తెలంగాణ అధికారులు, మంత్రి గట్టిగా పట్టుబట్టగా, ఏపీ మంత్రులు మాత్రం ఆ స్థాయిలో పట్టించుకోలేదు. దీంతో అధికారులే పలుదఫాలు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నారు. ఆ పరిణామాలు ఇప్పుడిప్పుడే బయట పడుతుండటంతో కార్మిక, ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ప్రతి డిపో నుంచి బస్సులు వెళ్లేవి. విభజన తర్వాత ఏపీలోని 128 డిపోల నుంచి 1,009 బస్సులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చేవి. అదే తెలంగాణ నుంచి 746 బస్సులు ఏపీలోకి వచ్చేవి. ఏపీ బస్సులు 2.65 లక్షల కిలోమీటర్లు పొరుగు రాష్ట్రంలో తిరిగితే, తెలంగాణ బస్సులు మన రాష్ట్రంలో 1.60 లక్షల కిలోమీటర్లు తిరిగేవి.

ఈ తేడాను తగ్గించాల్సిందేనని తెలంగాణ గట్టిగా పట్టుపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఏపీ అధికారులు అంగీకరించాల్సి వచ్చింది. అన్ని షరతులకు అంగీకరించి చేసుకున్న ఒప్పందంతో ఏపీ 371 బస్సులను తగ్గించుకోగా, తెలంగాణ 72 బస్సులు పెంచుకుంది. ఏపీ బస్సులు తెలంగాణలో 13 రూట్లలో తిరుగుతుండగా, టీఎస్‌ బస్సులు ఏపీలో 33 మార్గాల్లో తిరుగుతున్నాయి. వాటిలో కీలకమైన మార్గం విజయవాడ-హైదరాబాద్‌. ఈ రూట్లో మార్చి 22 వరకూ 139 బస్సులు(54వేల కిలోమీటర్లు) తిప్పిన ఏపీ తాజా ఒప్పందం తర్వాత ఆ సఖ్యను 75కు(27వేల కిలోమీటర్లు) తగ్గించుకుంది. గతంలో ఈ రూట్లో 89 బస్సులు(15వేల కి.మీ.) నడిపిన తెలంగాణ ఏకంగా 200కు(34వేల కి.మీ.) పెంచుకుంది. ఫలితంగా ఏపీఎ్‌సఆర్టీసీ ఏటా రూ.260 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర ఒప్పందం వల్ల 371 బస్సులు ఆగిపోయాయని, వాటిని రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలకు తిప్పాలని, మోటారు వాహన చట్ట నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న ప్రైవేటు బస్సులకు బ్రేకులెయ్యాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించింది. ఈ మేరకు ఈయూ నేతలు పలిశెట్టి దామోదర్‌రావు, వైవీ రావు తదితరులు ఈ నెల 10న సీఎంకు రాసిన లేఖను మంత్రి పేర్ని నాని, ఎండీ కృష్ణబాబుకు అందజేశారు. రాష్ట్రంలో 750 ప్రైవేటు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ కోట్లాది రూపాయల ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

తగ్గిన బస్సులు..

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఏపీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా విజయవాడ రూట్లో 98 బస్సులు తగ్గిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి 47, ప్రకాశం నుంచి 45, గుంటూరు 40, కర్నూలు 32, పశ్చిమ గోదావరి 28, చిత్తూరు 22, కడప 17, నెల్లూరు 16, అనంతపురం 12, విశాఖపట్నం 10, విజయనగరం 4 బస్సులు తగ్గించుకున్నాయి.

Tags :
|

Advertisement