Advertisement

  • కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్

By: chandrasekar Fri, 31 July 2020 10:48 AM

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్


తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ముందుకు రావడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అగస్టు 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కౌన్సిల్ భేటీలో హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గోదావరి నదీ యాజమాన్య సంస్థ 'జీఆర్‌ఎంబీ' సూచించింది. అయితే తమను సంప్రదించకుండానే తమ అభీష్టం తెలుసుకోకుండానే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖనే భేటీ ఎజెండాను, తేదీని ఖరారు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం, జూలై 30 ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు అనుభవించామని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది.

ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ తేదీపై సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆరోజు వేరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో సమావేశానికి ఆ తేదీ అనుకూలంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్వాతంత్య్ర దినోత్సవం కూడా దగ్గరలోనే ఉండటంతో ఆ వేడుకలు ముగిశాక అగస్టు 20 తదనంతరం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ సూచించారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ చొరవ తీసుకుని నీటి వాటాల పంపిణీని చేపట్టే ఆనవాయితీ ఉందని కానీ కేంద్రం పూర్తిగా దీన్ని విస్మరించిందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు లేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ జరగాలి. వివాదాలు నెలకొన్నప్పుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పట్టించుకోలేదు. ఈ వైఖరిని తాజా సమావేశం తీవ్రంగా ఖండించింది. కేంద్రం దుర్మార్గపూరిత వైఖరిని విడనాడి చిత్తశుద్దితో వ్యవహరించాలని సమావేశం అభిప్రాయపడింది. లేనిపక్షంలో కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇరు రాష్ట్రాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తమైంది. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సీఎంలు కేసీఆర్,జగన్ మొదట్లోనే ఒక అవగాహనకు వచ్చారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో జగన్ కేసీఆర్‌ను సంప్రదించకపోవడం ఇరు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపేదిగా మారింది. అయినప్పటికీ కేసీఆర్ సంయమనంతోనే వ్యవహరించారు. ఇప్పుడు,ఎప్పుడూ కలిసే ముందుకు వెళ్తామని అనోన్యంగానే కలిసి ఉంటామని స్పష్టం చేశారు. అయితే తాజాగా కేంద్రం జోక్యంతో ఇరువురు సీఎంలు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :
|

Advertisement