Advertisement

  • దేశంలోనే తొలిసారిగా 'పోలీస్ సేవ యాప్' ప్రారంభించిన ఏపీ పోలీస్

దేశంలోనే తొలిసారిగా 'పోలీస్ సేవ యాప్' ప్రారంభించిన ఏపీ పోలీస్

By: Sankar Mon, 21 Sept 2020 3:39 PM

దేశంలోనే తొలిసారిగా 'పోలీస్ సేవ యాప్' ప్రారంభించిన ఏపీ పోలీస్


దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’’ను రూపకల్పన చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండానే సేవలు పొందే విధంగా యాప్ రూపకల్పన చేశామని చెప్పారు.

దిశ వంటి చట్టాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీ పోలీస్ పలు ప్రశంసలు పొందిందని తెలిపారు. మరోమారు ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్‌ పనిచేయనుందన్నారు. మహిళా భద్రత విషయంలో ‘దిశ’ యాప్‌తో పాటు ఈ యాప్ కూడా పనిచేస్తుందని సుచరిత వెల్లడించారు.

పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో 87 సేవలను తీసుకువచ్చామని డీఐజీ పాల్‌ రాజ్‌ చెప్పారు. ఫిర్యాదు నుంచి కేసు ట్రయిల్‌ స్టేటస్‌ వరకూ యాప్‌ ద్వారా అప్‌డేట్‌ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రసీదు కూడా ఈ యాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.మహిళ రక్షణ, చోరీలు, రోడ్డు భద్రత వంటి అనేక అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా యాప్‌ ఉపయోగపడుతుందని పాల్‌ రాజ్ వెల్లడించారు.

కేసు దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఈ యాప్ సొంతం.

ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళలకు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణగా ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించనుంది. మహిళలకు అన్ని సందర్భాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్‌వోఎస్‌) స్వల్ప వ్యవధిలోనే 11 లక్షల డౌన్‌లోడ్స్‌ నమోదు చేసింది.

568 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్ లను నమోదుచేసి చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 1,850 పిటిషన్లు అందగా 309 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement