Advertisement

రేషన్ సరుకుల ధరలు పెంచిన ఏ.పి ప్రభుత్వం

By: chandrasekar Mon, 29 June 2020 1:53 PM

రేషన్ సరుకుల ధరలు పెంచిన ఏ.పి ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకుల ధరల్నిపెంచింది. వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతున్న జగన్ సర్కార్ ప్రజలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది.

రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు అందించే పంచదార, కందిపప్పు ధరలను పెంచింది. దీంతో ఇకపై సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు పెరిగిన ధరలకే సరుకులు వస్తాయి. అంటే ఇప్పటివరకూ రూ.40 ఉన్న కందిపప్పు రేటును ప్రభుత్వం రూ.67కి పెంచింది.

అర కేజీ పంచదార ధరను రూ.10 నుంచి రూ.17కి పెంచింది ప్రభుత్వం. అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం పంచదార ధర ఇదివరకటిలాగే ఉంటుంది. దీంతో ఎవరైనా కేజీ కందిపప్పు, కేజీ పంచదార కావాలని అనుకుంటే వారికి అదనంగా అయ్యే ఖర్చు రూ.34. ఇది పేదలకు ఇబ్బందికరమే అంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రేషన్ కార్డుల ద్వారానే అందించేవారు. గోధుములు, బియ్యం, వంట నూనె, కందిపప్పు, పంచదార, కిరోసిన్, శనగపప్పు ఇలా దాదాపు 9 నుంచి 10 రకాల సరుకుల్ని రేషన్ కార్డుల ద్వారా అందించేవి ప్రభుత్వాలు. కానీ రాను రాను వీటి సంఖ్యను తగ్గించేస్తున్నాయి.

ఇప్పుడు కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా బియ్యం, కందిపప్పు లాంటి రేషన్ సరుకులు ఇస్తోంది. మొత్తంగా ధరలను పెంచడం అనేది పేదలకు ఆర్థిక భారమే అంటున్నారు నిపుణులు. అసలే కరోనా కాలం నడుస్తోంది. లాక్ డౌన్ కారణంగా అనేకమంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు సైతం తమ ఉపాధిని కోల్పోయారు.

దీంతో అధిక ధరలు చెల్లించి ఇంటికి కావల్సిన నిత్యవసరాలు కొనే పరిస్థితి లేదు. ప్రజల దగ్గర కూడా అంత డబ్బు లేదు. దీంతో ఇలాంటి సమయాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు రావడం ఖాయం. మరోవైపు ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయం మంచిది కాదని అంటున్నారు.

Tags :
|

Advertisement