Advertisement

  • ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందించేందుకు సిద్ధం: వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందించేందుకు సిద్ధం: వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

By: chandrasekar Fri, 23 Oct 2020 09:28 AM

ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందించేందుకు సిద్ధం: వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు


ప్రతి వంటలోను ముఖ్యంగా వాడే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఉల్లిరేటు ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వంద రూపాయలు దాటుతోంది. కన్నీళ్లు తెప్పించడమే కాదు మధ్య తరగతికి కూడా అందనంటోంది. అందుకే ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయలు మరోసారి ఆకాశానికెక్కేశాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికే కాదు మధ్య తరగతి ప్రజలకు కూడా అందకుండా కంటనీరు తెప్పిస్తోంది. భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు అందకుండా పోయిన ఉల్లిపాయల్ని రైతు బజార్ల ద్వారా కిలో 40 రూపాయలకే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో 5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని ఇమ్మీడియేట్ గా వెయ్యి టన్నుల ఉల్లిని తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంచడానికి తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోని రైతు బ‌జార్ల ద్వారా కిలో 40 రూపాయలకు విక్రయించనున్నారు. నాణ్యమైన ఉల్లిపాయల్ని ప్రతి కుటుంబానికి ఒక కేజీ చొప్పున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటకు నష్టం వాటిల్లడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయి. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని మరో నెలలో కొత్త పంటలో కొంతభాగం అందుబాటులో వస్తుందన్నారు మంత్రి కన్నబాబు. ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్లకు వచ్చేదని ఇప్పుడు 15 వందల నుంచి 2 వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని కానీ భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయిందన్నారు. ధరలు తగ్గడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తుంది.

Tags :

Advertisement