Advertisement

  • కరోనా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

కరోనా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Thu, 13 Aug 2020 3:21 PM

కరోనా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం



ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కరోనా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అందుబాటులోకి తెచ్చింది. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 82971 04104 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

హెల్ప్‌లైన్‌ ద్వారా కరోనా లక్షణాలు, పరీక్షల వివరాలు, హోమ్‌ ఐసోలేషన్‌ జాగ్రత్తలు వివరించనున్నారు. కొవిడ్‌ సెంటర్‌లో చేరే ప్రక్రియ, అంబులెన్స్‌ సాయం వివరాలు తెలియజేస్తారు. టెలీ మెడిసిన్‌, 104 కాల్‌సెంటర్‌ వివరాలు తెలపనున్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితి చెప్పుకుని..కరోనా సందేహాలు తీర్చుకునే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వివరించారు.

ఇప్పటివరకు చాలామంది ప్రజలకు కరోనా వస్తే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి అన్న దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అలాంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్‌కు కాల్ చేసి తమకు ఉన్న సందేహాలన్నింటిని నివృత్తి చేసుకోవచ్చు. మరోవైపు ఏపీలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. బుధవారం రోజు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 57,148 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,597 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది

Tags :
|

Advertisement