Advertisement

  • వైద్యం కోసం ఏ ఒక్కరు అప్పులపాలు కాకూడదు..ఏపీ సీఎం వై ఎస్ జగన్

వైద్యం కోసం ఏ ఒక్కరు అప్పులపాలు కాకూడదు..ఏపీ సీఎం వై ఎస్ జగన్

By: Sankar Fri, 17 July 2020 2:29 PM

వైద్యం కోసం ఏ ఒక్కరు అప్పులపాలు కాకూడదు..ఏపీ సీఎం వై ఎస్ జగన్



కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్‌ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్‌ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు.

అంతేకాక.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు..

వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం అమలుచేస్తున్నామని.. తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్‌ కోడ్‌తో ఇస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ కార్డులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 1.38 కోట్ల కార్డులను పంపిణీ చేశామని.. మిగిలిన 4 లక్షల కార్డుల ముద్రణా పూర్తయిందని, వీలైనంత త్వరగా వలంటీర్ల ద్వారా వాటిని అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

గ్రామ సచివాలయాల పక్కనే అన్ని గ్రామాలలో 13 వేల వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు రోజంతా అందుబాటులో ఉంటారని, అవి రెఫరల్‌ ఆస్పత్రులుగా పనిచేస్తాయని తెలిపారు. వాటిల్లో 54 రకాల మందులు కూడా ఉంటాయని చెప్పారు.

Tags :
|
|
|

Advertisement