Advertisement

  • కరోనా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

కరోనా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

By: Sankar Tue, 28 July 2020 6:27 PM

కరోనా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్



ఏపీలో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చడంతో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ సోకిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి ఫోన్ చేయాలన్న దానిపై అందరికీ వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా పోస్టర్లు ఉంచాలని స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. కరోనాకు సంబంధించి 104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్లు ప్రకటనలు కూడా ఇచ్చామన్నారు. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు.. సమర్థవంతంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.

ర్యాండమ్‌గా అధికారులు సైతం ఫోన్ చేసి కాల్‌ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలన్నారు. కాల్‌ రాగానే సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలని సూచించారు. ఆ నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అనేది నిరంతరం చెక్‌ చేయాలన్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత.. హోం క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి.. రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులకు ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పంపిస్తామని వెల్లడించారు

రాష్ట్రవ్యాప్తంగా 128 జిల్లా ఆస్పత్రులను గుర్తించామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇందులో 32 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా సోకినట్లు తేలితే 30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరగాలని, పేషెంట్‌ ఎక్కడికి వచ్చినా అతని ఆరోగ్య పరిస్థితులను డాక్టర్‌ దృష్టిలో ఉంచుకుని ఎక్కడకు పంపాలన్న దానిపై నిర్ణయించాలన్నారు.

రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో 8 వేల బెడ్లు ఉన్నాయని, వీటిని క్రిటికల్‌ కేర్‌ కోసం వాడాలన్నారు. పేషెంట్ ఆరోగ్యాన్ని బట్టి అర్ధ గంటలోపు బెడ్‌ కేటాయించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటన్నింటికి కలెక్టర్, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తానని వెల్లడించారు. ఏ ఆస్పత్రి కూడా నిరాకరించే ధోరణి ఉండకూడదని, అలా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు..

కోవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద.. రాష్ట్రస్థాయి కోవిడ్ ‌ఆస్పత్రుల వద్ద ఫిర్యాదుల కోసం 1902 నంబర్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఆస్పత్రి సదుపాయాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించాలన్నారు. 128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో.. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డిస్‌ ప్లే చేయాలని, ఈ వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలన్నారు. మానవత్వంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలని, ఓ బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Tags :
|
|
|
|

Advertisement