Advertisement

  • నదీజలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు

నదీజలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు

By: Sankar Tue, 06 Oct 2020 10:26 PM

నదీజలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు


ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుతో పాటు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అపెక్స్‌ కౌన్సెల్‌లో స్పష్టం చేశారు. దాని ద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌లో ఏపీ కూడా తన వాదనను గట్టిగా వినిపించినట్లు ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్‌ చేయడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసినట్లు తెలిపాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీరందాలంటే కచ్చితంగా 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి తీరాల్సిందేనని వెల్లడించింది.

రోజుకు 3 టీఎంసీల చొప్పున మొత్తం 299 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి లిఫ్ట్‌ చేసేందుకు తెలంగాణ కూడా అంగీకరించిందని ఏపీ ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా కొత్తగా నీటి నిల్వ సామర్థ్యం.. కొత్త ఆయకట్టు రావడం లేదని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం కావాలనే యాగీ చేస్తోందని ఏపీ అభిప్రాయపడుతోంది.

రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మొత్తంగా 600 టీఎంసీల నీరు అవసరమవుతాయని గతంలో తెలంగాణ సీఎం కేసీఆరే అన్నారని ఏపీ ఇరిగేషన్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానిది కచ్చితంగా వితండవాదమేనని చెప్తున్నాయి. ఇదే విషయాన్ని సీఎం జగన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌లో వెల్లడించినట్లు తెలిపాయి.

ఇక నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవహరిస్తే ఊరుకోబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించబోమని ప్రకటించారు. తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్య మంత్రి మరోమారు స్పష్టం చేశారు.

Tags :
|
|
|

Advertisement