Advertisement

మరో కొత్త వైరస్...

By: chandrasekar Fri, 20 Nov 2020 6:29 PM

మరో కొత్త వైరస్...


అమెరికాకు చెందిన ఆరోగ్య పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఎబోలా వంటి మరో కొత్త వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈ వైరస్ జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, చిగుళ్ల రక్తస్రావం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో బయటపడుతుంది. ఎబోలా వంటి రక్తస్రావ జ్వరానికి ఇది కారణమవుతోంది. ఈ ప్రాణాంతక జంతు సంబంధ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని సీడీసీ నవంబర్ 16న ప్రకటించింది. ఈ కొత్త హెమొర్రాజిక్ ఫీవర్‌ను మొదటిసారి 2004లో బొలీవియాలోని చపారే ప్రావిన్స్ లో కనుగొన్నారు. ఆ తరువాత వైరస్ దానంతట అదే కనుమరుగైంది. చపారే అనే ప్రాంతంలో మొదటిసారి వైరస్ బయటపడినందున దీనికి చపారే వైరస్ అనే పేరు స్థిరపడింది. 2019లో మళ్లీ ఐదుగురికి ఈ వైరస్‌ సోకింది. చపారే వైరస్ శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. దీని బారిన పడినవారు చనిపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ వ్యాధికి సంబంధించిన యాక్టివ్ కేసులు నమోదుకాలేదు. ఒకవేళ మళ్లీ వెలుగు చూసినా, ఇది COVID-19 మాదిరిగా మహమ్మారిలా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. కానీ ప్రమాద తీవ్రత మాత్రం ఉంటుంది. గతేడాది చపారే వైరస్ సోకిన ఐదుగురిలో ముగ్గురు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఉన్నారు. వీరిలో ఇద్దరు చనిపోయినట్టు సీడీసీ పేర్కొంది.

వేగంగా వ్యాపిస్తుంది

ఈ వైరస్ శ్వాసకోశ అనారోగ్యాలను కలుగజేస్తుందని జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన కోలిన్ కార్ల్‌స్టన్ అంటున్నారు. ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగా కాకుండా, మనిషికి సోకిన వెంటనే దీని లక్షణాలు బయటపడతాయి. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ చపారే వైరస్ వ్యాప్తి మొదలైతే, కరోనా పరిస్థితుల మాదిరిగానే హెల్త్ కేర్ వ్యవస్థలు నాశనమవుతాయి. ఎందుకంటే వ్యాధి సోకిన రోగులకు చికిత్స చేసిన వైద్యులు కూడా అనారోగ్యానికి గురవుతారు. 2019లో చపారే వైరస్‌ను శారీరక ద్రవాల నమూనాలో కనుగొన్నారు. కానీ దీన్ని ముందుగా అంచనా వేయలేకపోయారు. వారు ఆ వైరస్‌ను డెంగీ అనుకున్నారు. దక్షిణ అమెరికాలో డెంగీ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది కూడా హెమొర్రాజిక్ ఫీవర్ మాదిరిగానే ఉంటుంది. కానీ తదుపరి పరీక్షల్లో వారికి డెంగీ వైరస్ కనిపించలేదు. దీంతో శాస్త్రవేత్తలు యెల్లో ఫీవర్, మచుపో వంటి ఇతర వ్యాధికారక కణాలను గుర్తించడానికి పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఈ వ్యాధులకు కూడా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఇవి రెండూ తీవ్రమైన హెమొర్రాజిక్ ఫీవర్‌ను కలుగజేస్తాయి.

ఈ వ్యాధిపై పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO)తో కలిసి CDC పరిశోధనలు చేసింది. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన పరీక్షల్లో చపారే వైరస్ను గుర్తించారు. ఇందుకు అవసరమైన చపారే వైరస్ నమూనాను సీడీసీకి PAHO అందజేసింది. మొత్తానికి చపారేలో ఉండే RNA శకలాలనను పరిశోధకులు గుర్తించారు. దీంతో ఈ వైరస్‌ను నిర్ధారించడానికి CDC వీలైనంత తొందరగా RT-PCR పరీక్షను అభివృద్ధి చేయగలిగింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించగలదని 2019లో తేలింది. వ్యాధి సోకిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులకు ఈ వైరస్ వ్యాపించిందని అప్పట్లో నిర్ధారించారు. చపారే వైరస్ సోకి కోలుకున్న వ్యక్తి వీర్యంలో 168 రోజుల తరువాత కూడా ఈ వైరస్ ప్రాణాలతో ఉందని నిపుణులు గుర్తించారు. దీని బారిన పడిన మొదటి రోగి ఇంటి చుట్టు పక్కల, వ్యవసాయ భూముల సమీపంలోని ఎలుకల్లో కూడా చపారే వైరస్‌ను కనుగొన్నారు. కానీ ఎలుకల వల్లే ఇది వ్యాపిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement