Advertisement

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు

By: chandrasekar Tue, 27 Oct 2020 11:54 AM

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు


తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం నుండి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల్లో వాతావ‌ర‌ణ పరిస్థితులపై సోమవారం హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వారం క్రితం కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అతలాకుతలైన సంగతి తెలిసిందే. రాగ‌ల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుప‌వ‌నాల ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉపరితల ఆవర్తనం దృష్ట్యా ఈ నెల 29న (గురువారం) మధ్య బంగాళాఖాతం, ఉత్త‌ర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనివల్ల బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే.. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈశాన్య రుతుపవన వర్షాలు ఈనెల 28న పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. రేపటికల్లా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags :
|

Advertisement