Advertisement

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం డిసెంబర్ లో మరో రెండు తుఫానులు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం డిసెంబర్ లో మరో రెండు తుఫానులు

By: chandrasekar Sat, 28 Nov 2020 2:47 PM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం డిసెంబర్ లో మరో రెండు తుఫానులు


అసలే నివర్ తుఫాను నుండి ఇంకా తేరుకోక ముందే మరో రెండు తుఫానులు కబళించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్లు వదిలేలా లేవు. ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు వణికిపోతున్నాయి. మిగిలిన కొన్ని జిల్లాలో కూడా భారీ ప్రభావం చూపించినా ఈ మూడు జిల్లాల్లో మాత్రం నష్టం భారీగా ఉంది. ఇప్పుడు విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్‌2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నివర్ తుఫాను వల్ల నష్టం ఏర్పడ్డ ప్రదేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు. నివర్‌ తుఫాన్‌పై నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. వరద సహాయక శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. నివర్ తుఫాన్ ప్రభావం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పంటలకు నష్టాలు ఏర్పడ్డాయి.

ఇక్కడ బాధిత ప్రాంతాలలో అగ్నిమాపక సిబ్బంది 24గంటలూ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆ శాఖ డీజీ ఎండీ హసన్ రాజా తెలిపారు. వందల మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మూడు రోజులుగా మా సిబ్బంది తుఫాన్ ప్రాంతాలలో ప్రజల రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నెల్లూరు లో 12, చిత్తూరు లో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశం లో 11 రెస్క్యూ టీంలు పని చేస్తున్నాయి అని చెప్పారు. నివర్ తుఫాన్ సమయంలో మూడు జిల్లాల్లో 87 టీంలుగా 523 మంది పనిచేస్తున్నారని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ కె.జయరాం నాయక్ తెలిపారు. కడప జిల్లాలో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడామన్నారు. శ్రీకాళహస్తి లో వరదలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడి సిబ్బందికి లక్ష రూపాయలు బహుమానంగా ప్రకటించారని చెప్పారు. SDRF, NDRF ల కన్నా స్థానికంగా అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఎక్కువుగా ఉంటుందన్నారు. అందువల్ల ఎక్కడ ప్రకృతి విపత్తులు కలిగినా ఆయా ప్రాంతాలలో సిబ్బంది ని అలెర్ట్ చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

Advertisement