Advertisement

చైనాలో మరో సంక్షోభం...

By: chandrasekar Mon, 07 Dec 2020 5:16 PM

చైనాలో మరో సంక్షోభం...


కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనా ఇప్పడిప్పుడే వైరస్ నుంచి కోలుకుంటోంది. అయితే, కరోనా వ్యాపించడానికి చైనానే మూల కారణమని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, చైనా ఇప్పడు మరో సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా తమ దేశ జనాభాను నియంత్రించే ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం సింగిల్ కిడ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని రెండు దశాబ్ధాల పాటు కఠినంగా అమలు చేసింది. దీంతో చైనాలో వృద్ధ జనాభా పెరిగి, పిల్లలు, యువత సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో అక్కడ మానవ వనరుల కొరత ఏర్పడింది. దీన్ని గమనించిన అక్కడి ప్రభుత్వం 2016లో ఆ పాలసీని విరమించుకుంది. సింగిల్ కిడ్ పాలసీకి ప్రజలు అలవాటు పడటంతో త్వరలో చైనా మ్యాన్ పవర్ సమస్యను ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనాలని చైనా అధికారులు ప్రజలను కోరుతున్నారు. అయినప్పటికీ ప్రజలు వారి విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే చైనా సమాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పుల కారణంగా జీవన వ్యయం భారీగా పెరిగి౦ది. దీంతో యువత పెళ్లిళ్లు చేసుకోవడాన్ని, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకోవడం ప్రారంభించారు. తద్వారా అక్కడ పునరుత్పత్తి రేటు గణనీయంగా పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరింది.

చైనా జనాభా దృష్ట్యా పునరుత్పత్తి రేటు 2.1గా ఉండాలని, ఇది 1.5 కంటే దిగువకు చేరుకుంటే ప్రమాదం ముంచుకొస్తున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వారు చైనా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, 10 సంవత్సరాల క్రితం నిర్వహించిన చివరి జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 1.37 బిలియన్లుగా నమోదైంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చైనాలో జనన రేటు గత సంవత్సరం నాటికి గణనీయంగా తగ్గింది. అక్కడ ప్రతి 1,000 మందికి 10.48 మంది జనాభా తగ్గారు. దీంతో మొత్తం జననాల సంఖ్య కూడా 5,80,000 మేర తగ్గింది. గత ఏడు దశాబ్దాలతో పోలిస్తే ఇంత తక్కువ స్థాయిలో జనాభా వృద్ధిరేటు నమోదు కావడం ఇదే ప్రథమం అని నిపుణులు అంటున్నారు. గణాంకాల ప్రకారం చైనాలో 60 ఏళ్లకు పైబడిన జనాభా 420 మిలియన్లకు పెరిగిందని, దీంతో నర్సింగ్ సేవలు, డేకేర్ కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి పెరిగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సింగిల్ చైల్ పాలసీతో 400 మిలియన్ల శ్రామిక- వయస్సు గల వ్యక్తులను చైనా కోల్పోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tags :
|

Advertisement