Advertisement

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది...!

By: Anji Thu, 03 Dec 2020 7:20 PM

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది...!

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగబోనుంది.

ఎమ్మెల్యే సీటు ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కన మార్చి తర్వాత ఎప్పుడైన నాగార్జున సాగర్ ఎన్నిక రావొచ్చు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికపైనా అప్పుడే చర్చ మొదలైంది.

అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు కూడా కొన్ని పార్టీలు ప్రారంభించాయని ప్రచారం జరుగుతోంది. దుబ్బాక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుతో ఊపు మీదున్న బీజేపీ.. నాగార్జున సాగర్ పైనా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిచ్చి... అదే జోష్ తో జీహెచ్ఎంసీ పోరులో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన బీజేపీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మాత్రం సవాల్ గా మారనుందనే చర్చ జరుగుతోంది.

పోలిస్తే నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే. నల్గొండ జిల్లాలోని మిగితా ప్రాంతాల కంటే నాగార్జున సాగర్ సెగ్మెంట్ లోనే బీజేపీ పూర్ గా ఉందని చెబుతున్నారు.

హాలియా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే కొంత బీజేపీ బలంగా ఉంది. దుబ్బాకలో అయితే బీజేపీకి కేడర్ ఉంది. గతంలో మెదక్ నుంచి బీజేపీ ఎంపీ సీటు కూడా గెలిచింది. ఈ లెక్కన దుబ్బాకతో పోలిస్తే నాగార్జున సాగర్ లో బీజేపీ చాలా వీక్ అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ ఎలాంటి పోటీ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డి పోటీ చేశారు. ఆమెకు కేవలం ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ కంటే సమాజ్ వాదీ బ్యాక్ వర్డ్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎస్పీ అభ్యర్థికి 9 వేల 819 ఓట్లు రాగా నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదిత రెడ్డి భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ బలపడిందని చెబుతున్నారు. అయితే గెలిచేంత స్థాయికి మాత్రం రాలేదంటున్నారు.

నాగార్జున సాగర్ గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు.

పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్‌ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు.

తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై సంచలన విజయం సాధించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెడ్డి, యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు వర్గాల వారే ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తుంటారు. బీజేపీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇతర పార్టీల అభ్యర్థులను బట్టి నిర్ణయం తీసుకునే ఉంది. నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా జానారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో నిలవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగితే మాత్రం టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీనే ఉంటుంది. జానారెడ్డి తప్పుకుని ఆయన కొడుకుతో పోటీ చేయిస్తారనే చర్చ కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జానారెడ్డే పోటీ చేశారు.

మరో వైపు జానారెడ్డి కొడుకుతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దుబ్బాకలో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు ఇప్పటివరకు ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. తెలంగాణలో ఆ పార్టీకి ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

Tags :

Advertisement