Advertisement

  • ఆగష్టు 19వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశాలు... పలు వివాదాలపై చర్చ

ఆగష్టు 19వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశాలు... పలు వివాదాలపై చర్చ

By: chandrasekar Fri, 14 Aug 2020 6:55 PM

ఆగష్టు 19వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశాలు... పలు వివాదాలపై చర్చ


ఈ నెల ఆగష్టు 19వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశాలు జరగనున్నాయి మరియు ఈ సమావేశంలో ప్రస్తుత పలు వివాదాలపై చర్చ జరగవచ్చని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19వ తేదీన సమావేశ కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గల సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటవుతుందని తెలుస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గం సమావేశం అయ్యే వేదిక మారొచ్చనీ అంటున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో జల వివాదాలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై న్యాయపరమైన చిక్కులు, మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేయడం, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు స్టేటస్ కోను పొడిగించడం వంటి పరిణామాల మధ్య కేబినెట్ సమావేశం జరగనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యంగా తెలంగాణతో ఏర్పడిన జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గంలో చర్చిస్తారని అంటున్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించ తల పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

రాష్ట్రంలోని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాలను త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తేల్చుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేబినెట్‌లో చర్చిస్తారని చెబుతున్నారు. దీనితో పాటు మూడు రాజధానులను తరలించే అంశంపైనా మంత్రివర్గం చర్చించనుంది. వివిధ రాజదానుల ఏర్పాట్లకు అవసరమైన వాటిపై ముఖ్యంగా చర్చించనున్నారు.

విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని ఇదివరకు నిర్ణయించుకున్నప్పటికీ దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉండటమే. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం, దాన్ని పొడిగించడం వంటి పరిణామాల నేపథ్యంలో నిర్దేశిత సమయానికి శంకుస్థాపన పనులను చేపట్టకపోవచ్చని ప్రభుత్వం భావించింది. తరువాతి ముహూర్తం ఎప్పుడనే విషయంపైనా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసికొంటుందని వెల్లడించారు.

Tags :

Advertisement