Advertisement

  • ట్రంకుపెట్టెల్లో బంగారం, నగదుతో ఖజానా ఉద్యోగిపై వేటు

ట్రంకుపెట్టెల్లో బంగారం, నగదుతో ఖజానా ఉద్యోగిపై వేటు

By: Dimple Tue, 25 Aug 2020 3:40 PM

ట్రంకుపెట్టెల్లో బంగారం, నగదుతో ఖజానా ఉద్యోగిపై వేటు

ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టడం... అవినీతికి పాల్పడిన నగలు నగదుతో పట్టుబడటంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కోట్ల రూపాయల విలువైన అవినీతి సొమ్మును దాచిపెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇటీవల బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ట్రంకు పెట్టెల్లో మొత్తం 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84.10 కిలోలు వెండి ఆభరణాలు, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.27.05 లక్షల విలువైన బాండ్లు లభించాయి. వీటితోపాటు 2 కార్లు, 7 ద్విచక్రవాహనాలు, 4 ట్రాక్టర్లు సీజ్‌ చేశారు.

ఇందులో మూడు ఖరీదైన బైక్‌లు ఉన్నాయి. మూడు 9ఎంఎం పిస్టల్స్‌, తూటాలు, ఒక ఎయిర్‌ గన్‌ స్వాధీనం చేసుకొని.. అవి నకిలీవిగా తేల్చారు. ఈ సొత్తు మొత్తం ఖజానా శాఖలో పని చేసే సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌కు చెందినవిగా విచారణలో తేలింది. దీంతో భారీగా అవినీతికి పాల్పడటంతో అధికారులు అతనిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అయితే ప్రస్తుతం మనోజ్‌ కుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని జిల్లా ఎస్పీ ద్వారా డీజీపీ కార్యాలయాన్ని కోరారు. అయితే డీజీపీ కార్యాలయం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏసీబీ రంగంలోకి దిగితే మనోజ్‌ కుమార్‌కు ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.

Tags :

Advertisement