Advertisement

  • బెలరూస్ స్వతంత్రం తర్వాత కనీవినీ ఎరగని సంఖ్యలో జనం స్వేత్లానా ర్యాలీలలో పాల్గొన్నారు

బెలరూస్ స్వతంత్రం తర్వాత కనీవినీ ఎరగని సంఖ్యలో జనం స్వేత్లానా ర్యాలీలలో పాల్గొన్నారు

By: chandrasekar Wed, 02 Sept 2020 11:44 AM

బెలరూస్ స్వతంత్రం తర్వాత కనీవినీ ఎరగని సంఖ్యలో జనం స్వేత్లానా ర్యాలీలలో పాల్గొన్నారు


సోవియట్‌ యూనియన్‌ ముక్కలైన సమయంలో బెలరూస్‌ స్వతంత్ర దేశంగా విడిపోయింది. 1994లో ఓ రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఎన్నికలను నిర్వహించుకుంది. అప్పుడు గద్దెనెక్కిన ‘అలెగ్జాండర్‌ లుకషెన్కో’ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ప్రతి ఎన్నికనీ ఓ ప్రహసనంగా మార్చేస్తూ పదవి దక్కించుంటున్నాడు. బెలరూస్‌లో మానవహక్కులకు ప్రమాదం ఏర్పడుతున్నదంటూ అమెరికా నుంచి ఆమ్నెస్టీ వరకు ఎవరు ఎన్ని ఆరోపణలు చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం తీరు మారనేలేదు.

2020లో కూడా ఇలాంటి ఎన్నికలనే నిర్వహించే ప్రయత్నం చేసింది. కరోనా‌ ఉందంటూ జనం భయపడితే ‘రోజూ కాస్త వోడ్కా తీసుకుంటే అదే పోతుంది’ అంటూ అలెగ్జాండర్‌ ప్రకటించాడు. అదెంతవరకు నిజమో కానీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కరోనా‌ను మించిన భయమొకటి అలెగ్జాండర్‌ను కంగారు పడేలా చేసి౦ది. అదే ‘స్వేత్‌లానా సికనోస్కయా’. స్వేత్‌లానా ఓ ఇంగ్లిష్‌ టీచర్‌. సమాజ సేవకురాలు. సెర్గేవ్‌ తిఖనోవ్‌స్కీ అనే ప్రజాస్వామ్యవాదిని పెండ్లి చేసుకుంది. ఈ ఏడాది జరగబోయే ఎన్నికలలో, తను అధ్యక్షపదవికి పోటీ చేస్తానని సెర్గేవ్‌ ప్రకటించగానే ఆమె జీవితం మారిపోయింది.

సెర్గేవ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ మాటకు వస్తే, అధ్యక్ష పదవి చేపట్టే ఆలోచన ఉన్నవారందరినీ ఎన్నికల్లో నిలబడే అవకాశం లేకుండా చేసింది. ఇక స్వేత్‌లానా ఆలోచించలేదు. భర్త తరఫునే కాదు, దేశం తరఫునా ఎన్నికల్లో నిలబడాలనుకున్నది. స్వేత్‌లానా నిర్ణయంతో ప్రభుత్వం చిరాకుపడింది. ‘దేశాన్ని పాలించడానికి మహిళలు పనికిరారంటూ’ అలెగ్జాండర్‌ ఎగతాళి చేశాడు. ‘నీ పిల్లల్ని అనాథాశ్రమంలో పడేస్తామంటూ’ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అయినా స్వేత్‌లానా తడబడలేదు. ప్రచారపు జోరు పెంచింది.

స్వతంత్రం తర్వాత కనీవినీ ఎరగని సంఖ్యలో జనం ఆమె ర్యాలీలలో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వం సంకెళ్లని మరింతగా బిగించింది. ముందస్తు అరెస్టులు, ర్యాలీలని చెదరగొట్టడం లాంటి చర్యలు ప్రారంభించాయి. ఓ సమయంలో స్వేత్‌లానా కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల రోజు రాజధాని మింస్క్‌కు వెళ్లే దారులను మూసివేశారు. ఇంటర్నెట్‌ ఆగిపోయింది. సాయంత్రానికి అలెగ్జాండర్‌ దాదాపు 80 శాతం ఓట్లు సాధించినట్టు ప్రభుత్వ టీవీ చానల్‌ ప్రకటించింది.

ఎన్నికల తర్వాత స్వేత్‌లానా మీద మరిన్ని చర్యలు తప్పవని తెలిసిపోయింది. దాంతో ఆమె లిథువేనియా దేశానికి ప్రవాసం వెళ్లారు. అక్కడి నుంచే తన పోరు కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ‘బెలరూస్‌లో మార్పును కోరుకునేవాళ్లదే ఇప్పుడు మెజారిటీ... ప్రస్తుతం అక్కడో నిశబ్ద విప్లవం నడుస్తున్నది’ అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. మహామహా నేతల వల్లే రాని మార్పు... ఓ 37 ఏండ్ల మనిషితో సాధ్యమయ్యే ఆశ కనిపిస్తున్నది. ‘నేను అధికారం కోసం పాకులాడే నేతను కాదు, మార్పు కోరుకునే సగటు మనిషిని. అందుకనే ప్రజలు నా వైపు నిలబడుతున్నారు. నిశబ్దంగా, ఓర్పుగా ఉండి అలసిపోయాను. భయంతో బతుకుతూ అలిసిపోయాను. ఇప్పుడిక స్వేచ్ఛ కావాలి...’ అంటున్నారు స్వేత్‌లానా! బెలరూస్‌ ప్రజలదీ అదే ఆలోచనేమో!!

Tags :
|

Advertisement