Advertisement

  • భారత్‌పై ఆరోపణలు చేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

భారత్‌పై ఆరోపణలు చేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

By: chandrasekar Wed, 30 Sept 2020 10:06 AM

భారత్‌పై ఆరోపణలు చేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్


అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్‌లో తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని సంస్థ ఆరోపించింది. సెప్టెంబరు 10 నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమ ఖాతాలన్నీ స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ కార్యకలాపాల్ని బలవంతంగా నిలిపివేయాల్సి వస్తోందని మంగళవారం తెలిపింది. ప్రభుత్వం కావాలనే తమను నిరంతరంగా వెంటాడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు విదేశీ నిధులు చట్టవిరుద్ధంగా అందుతున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది.

2018లోనే బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. గతేడాది ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఆధారాలు లభించడంతో తాజాగా బ్యాంక్‌ ఖాతాలను నిలిపివేసింది. అంతేకాకుండా ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్‌సీఆర్ఏ)’ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమ్నెస్టీపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

గత ఎనిమిదేళ్లలో దేశంలో 40 లక్షల మందికి పైగా సంస్థకు సహకరించారని వెల్లడించారు. 10 లక్షల మంది భారతీయులు ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. చట్టాలకు లోబడే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వంపై గళం ఎత్తుతున్న వారిలో భయం నెలకొల్పేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోందని ఆయన ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై గళం వినిపిస్తున్నందుకే మమ్మల్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఆరోపించింది.

Tags :
|

Advertisement