Advertisement

  • అమ్మోనియం నైట్రేట్‌ వల్ల లెబనాన్‌లోని బేరూత్‌ పోర్ట్‌లో పేలుడు...100 మంది పైగా మృతి

అమ్మోనియం నైట్రేట్‌ వల్ల లెబనాన్‌లోని బేరూత్‌ పోర్ట్‌లో పేలుడు...100 మంది పైగా మృతి

By: chandrasekar Thu, 06 Aug 2020 5:43 PM

అమ్మోనియం నైట్రేట్‌ వల్ల లెబనాన్‌లోని బేరూత్‌ పోర్ట్‌లో పేలుడు...100 మంది పైగా మృతి


సుమారు 3,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను లెబనాన్‌లోని బేరూత్‌ పోర్ట్‌లో ఆరేళ్ల కిందట ఒక ఓడ నుంచి దింపి రేవు సమీపంలోని ఓ గోదాంలో ఉంచారు. మంగళవారం జరిగిన భారీ పేలుడుకు ఇదే కారణమని చెబుతున్నారు.

అమ్మోనియం నైట్రేట్ ఏంటి?

తెలుపు రంగులో స్ఫటికాల రూపంలో అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది. పరిశ్రమలలో దీన్ని భారీ ఎత్తున తయారు చేస్తారు. ప్రధానంగా దీన్ని పంటలకు ఎరువుగా వాడుతుంటారు. అయితే పేలుడు పదార్థంగానూ దీన్ని ఉపయోగిస్తుంటారు. "అమ్మోనియాను, నైట్రిక్‌ యాసిడ్‌ను కలపడం వల్ల ఏర్పడిన సింథటిక్‌ పదార్ధమే అమ్మోనియం నైట్రేట్'' అని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆండ్రియా సెల్లా చెప్పారు. అమ్మోనియం నైట్రేట్‌ను తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడైనా దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. కానీ నిలవ చేయడం పెద్ద సమస్య. పేలుళ్లకు దారి తీస్తుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

అది ఎంత ప్రమాదకరం?

కొద్ది మొత్తంలో ఉన్నప్పుడు దీనితో సమస్య లేదు. కానీ పెద్ద మొత్తంలో తయారు చేసినప్పుడు నిల్వ చేయడం కష్టం. ఎక్కువకాలం అలాగే వదిలేస్తే పాడైపోతుంది. " చాలా రోజులు నిల్వ ఉంచినప్పుడు అది గాలితో తేమను పీల్చుకుని గట్టి రాయిలా తయారవుతుంది. ఇది ఇంకా ప్రమాదకరం. ఈ పరిస్థితిలో అది అంటుకుంటే వేగంగా విస్తరిస్తుంది'' అని ప్రొఫెసర్‌ సెల్లా చెప్పారు. "నిల్వ ఉంచడం వల్ల అది ఆయిల్‌లాంటి పదార్ధాలు తగిలినప్పుడు చెడిపోవడం మొదలు పెడుతుంది. అలా చెడిపోవడం మొదలు పెట్టిన తర్వాత అనేక మార్పులు జరుగుతాయి. ఒక్కసారి వేడెక్కడం మొదలు పెడితే, అలా వేడెక్కుతూనే ఉంటుంది. ఒక్కోసారి భారీ పేలుడుకు దారి తీస్తుంది. ఇప్పుడు బేరూత్‌లో జరిగిన ప్రమాదం అలాంటిదే" అని మాజీ మిలిటరీ అధికారి ఫిలిప్‌ ఇంగ్రామ్‌ అన్నారు.

బేరూత్ ప్రమాదం వీడియోలో పేలుడు సమయంలో పుట్టుగొడుగులా ఒక మేఘంలాంటి ఆకారం కనిపించింది. "ఒక భారీ పేలుడు సంభవించినప్పుడు ఆకాశంవైపు ప్రయాణిస్తూ ఒక పొగమేఘంలాంటి ఆకారం కనిపించింది. గాలి ఒక్కసారిగావ్యాప్తి చెందినప్పుడు అందులో ఉన్న నీటి ఆవిరి అలాంటి మేఘాలను సృష్టిస్తుంది'' అని ప్రొఫెసర్‌ సెల్లా వెల్లడించారు.

పేలుడు వల్ల వెలువడ్డ వాయువులు ప్రమాదకరం

అమ్మోనియం నైట్రేట్ పదార్ధం పేలినప్పుడు దాని నుంచి అమ్మోనియా గ్యాస్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. నారింజ రంగు పొగలు నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వల్ల ఏర్పడతాయి. ఇవి వాయు కాలుష్యానికి కారణమవుతాయి. "ఎక్కువ గాలి లేకపోతే ఇది స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ప్రొఫెసర్ సెల్లా అన్నారు.

అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేసిన పేలుడు పదార్ధాలను సైనిక దళాలు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాయి. తీవ్రవాదులు కూడా దీన్ని పేలుళ్ల కోసం వాడుతుంటారు. 1995లో ఓక్లహమా సిటీలో ఇలాంటి పేలుడు ఒకటి జరిగింది. ఈ ఘటనలో సుమారు 2 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించి పేలుళ్లు జరపగా, ఒక పెద్ద ప్రభుత్వ భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. 168మంది మరణించారు.

గతంలో జరిగిన ప్రమాదాలు

* 1921లో జర్మనీలోని ఒప్పావ్‌ అనే ప్రాంతంలో 4,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలింది. ఈ ఘటనలో 500మందికి పైగా మరణించారు.

* 1947లో అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంలో టెక్సాస్‌ నగరంలో సుమారు 581మంది దుర్మరణం పాలయ్యారు. ఒక పోర్టు దగ్గర దింపడానికి సిద్ధంగా ఉంచిన 2,000 టన్నుల రసాయనం ఓడలో ఉండగానే పేలింది.

* ఇటీవల చైనాలోని తియాన్జిన్‌ ప్రావిన్స్‌లో అమ్మోనియం నైట్రేట్ పదార్ధం పేలి 173మంది చనిపోయారు.

Tags :

Advertisement