Advertisement

చైనా పై అమెరికా ఆరోపణ

By: chandrasekar Sat, 23 May 2020 5:06 PM

చైనా పై అమెరికా ఆరోపణ


కోవిడ్-19పై తమ దేశంలో జరుగుతున్న పరిశోధనలను చైనాతో సంబంధాలున్న హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు, చికిత్స, పరీక్షల విషయంలో తమ దేశ సంస్థలు, బృందాలు చేస్తున్న పరిశోధనలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.

చైనా ప్రభుత్వం సైబర్ గూఢచర్యానికి పాల్పడుతోందని చాలా రోజుల నుంచి అమెరికా ఆరోపణలు చేస్తోంది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. కరోనావైరస్ సంక్షోభంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో మీరు విఫలమయ్యారంటే, మీరు విఫలమయ్యారంటూ అమెరికా, చైనా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.


america,accusation,against,china. covid ,చైనా, అమెరికా, యొక్క, ఆరోపణ, కోవిడ్


జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 53 లక్షలకుపైగా మంది కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ ఇన్ఫెక్షన్‌తో అమెరికాలో 96,329 మంది బలవ్వగా, చైనాలో 4,634 మంది చనిపోయారు. ఎఫ్‌బీఐ, అమెరికా హోంల్యాండ్ భద్రత విభాగానికి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ (సీఐఎస్ఏ) అరుదైన ఓ సంయుక్త హెచ్చరిక జారీ చేశాయి.

కరోనాకు సంబంధించి వైద్యం, ఫార్మాసూటికల్, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్నవాళ్లు హ్యాకర్లకు ప్రధాన లక్ష్యం అనే విషయాన్ని గుర్తించాలని కోరాయి. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జారీ చేసిన ప్రకటనగా దీన్ని పేర్కొన్నాయి. కరోనావైరస్‌ను ఎదుర్కొనే విషయంలో విలువైన మేధో సంపత్తిని, ప్రజారోగ్య సమాచారాన్ని అక్రమంగా సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని వివరించాయి. సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లుగా తమపై వస్తున్న ఆరోపణలను చైనా పదేపదే తోసిపుచ్చుతోంది. కోవిడ్-19 చికిత్స, వ్యాక్సిన్ కోసం పరిశోధనల విషయంలో చైనా చాలా ముందుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. వదంతులు, నిరాధార ఆరోపణలతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అనైతికమని అన్నారు.

Tags :

Advertisement