Advertisement

  • పోలీసుల్లో ఒకరు తప్పు చేసిన వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది ..తెలంగాణ హైకోర్టు

పోలీసుల్లో ఒకరు తప్పు చేసిన వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది ..తెలంగాణ హైకోర్టు

By: Sankar Thu, 18 June 2020 12:10 PM

పోలీసుల్లో ఒకరు తప్పు చేసిన వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది ..తెలంగాణ హైకోర్టు



కరోనా కష్టకాలంలో పోలీసులు కష్టపడి పనిచేశారని, ఎక్కడో కొద్దిమంది బాధ్యతను విస్మరిస్తే మొత్తం పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల అమెరికాలో ఒకరిద్దరు పోలీసులు ఆఫ్రో అమెరికన్లను చంపిన ఘటనకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలను ఇక్కడి పోలీసులు కూడా గుణపాఠంగా భావించాలని సూచించింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించిన ఘటనలపై ఉమేశ్‌చంద్ర, షీలా సరా మాథ్యూస్, మసూద్‌ విడివిడిగా రాసిన లేఖలను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి బుధవారం మరోసారి విచారణ జరిపింది. పోలీసుల తరఫున ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ఒక వర్గంపై దాడులు జరిగినట్లు వ్యాజ్యాలు ఉన్నాయని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని, ఇలాంటి విషయాలపై లోతుగా విచారణ చేస్తామని చెప్పింది. సరుకులు కొనుగోలు చేస్తుంటే పోలీస్‌ వ్యాన్‌ వచ్చిందని భయపడి పారిపోయిన వ్యక్తి ఒక భవనంలోని రెండో అంతస్తులోకి వెళ్లి పడిపోవడంతో కాలుకు గాయమైందని, పోలీసులను చూసి జనం పారిపోయే పరిస్థితులు ఎందుకు రావాలని ప్రశ్నించింది. వాహనాల్ని పోలీసులు లాఠీతో కొట్టడం వల్ల భయంతో పారిపోయారని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొనడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. శాస్త్రిపురంలో ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్టును కొట్టారనే పిటిషన్‌లో తమను పోలీసులు కొట్టలేదని ఆ వ్యక్తులు చెప్పారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు.

ఇదే నిజమైతే పత్రికల్లో తప్పుగా వార్తలు వచ్చాయా? ప్రతికల వివరణ ఎందుకు కోరలేదని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు తమను కొట్టలేదని బాధితుల నుంచి బలవంతంగా చెప్పించి ఉండవచ్చని కూడా అనుమానాన్ని వ్యక్తం చేసింది. మరో కేసులో ఒక అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ ఎత్తేసి రెండు ఇంక్రిమెంట్లను కోతతో సరిపెట్టడంపై వివరాలు లేకపోవడాన్ని ప్రశ్నించింది. మరో ఘటనలో ఒక వ్యక్తిపై పోలీసులు విసిరినట్లు చెబుతున్న లాఠీ వల్ల అతనికి 33 కుట్లు పడ్డాయని కౌంటర్‌లో చెప్పడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. ఈ ఘటనలపై వైద్యులిచ్చిన నివేదికను ఎందుకు జత చేయలేదని ప్రశ్నించింది. అసమగ్రంగా కౌంటర్‌ దాఖలు కుదరదని, పూర్తి వివరాలతో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Tags :
|
|

Advertisement