Advertisement

  • రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంపై నెలకొన్న సందిగ్దత

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంపై నెలకొన్న సందిగ్దత

By: chandrasekar Tue, 01 Sept 2020 09:43 AM

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంపై నెలకొన్న సందిగ్దత


రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు పై సందిగ్దత నెలకొంది. రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో జీఎస్టీ చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు చెప్తున్నా కేంద్రం చెవికెక్కించుకోలేదని తెలిసింది. జీఎస్టీ పరిహారంపై త్వరలో ప్రకటన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ దాదాపు రెండు నెలల కిందట ప్రకటించారు. అప్పటి నుంచి చర్చలు జరిపిన కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు చట్టం ప్రకారం 14% వృద్ధిరేటు అంచనాతో పరిహారం చెల్లించాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌తో అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన సైతం చట్టాన్ని అనుసరించాల్సిందేనని, ఎలా చెల్లించాలనేది కేంద్రం ఇష్టమని స్పష్టం చేశారని సమాచారం.

మాములుగా అధికారులు ప్రాథమికంగా చర్చలు జరిపి, నివేదికను ఆర్థికమంత్రికి అప్పగిస్తారు. ఆ తర్వాత మరోసారి విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మొదటి నుంచీ అధికారుల సమావేశాల్లో పాల్గొన్నారని సమాచారం. వృద్ధిరేటును 14 శాతంగా కాకుండా 10 శాతంగా పేర్కొంటూ అంచనాలు తయారుచేయాలని అధికారులను కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. మిగతా 4 శాతాన్ని ద్రవ్యోల్బణం కింద పేర్కొనాలని సూచించినట్టు తెలిసింది. దీనికి యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌, కరోనా పేరు పెట్టాలని భావించారని సమాచారం. ఈ నిర్ణయంతో చెల్లించాల్సిన పరిహారంలో రూ.1.35 లక్షల కోట్లు తగ్గింది. పరిహారాన్ని అప్పు రూపంలో మోపడం ద్వారా కేంద్రం రాష్ట్రాల అవకాశాలకు గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

తెలంగాణ వంటి రాష్ట్రాలకు అప్పులు పెట్టుబడిగా మారి సంపద సృష్టికి కారణం అవుతాయి. కానీ పరిహారాన్ని ఎఫ్‌ఆర్బీఎం పరిధిలోకి తేవడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పు తెచ్చుకొనే అవకాశాలు మూసుకుపోతాయి. పైగా వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తుంది. కేంద్రం 2022 జూన్‌ వరకు విడుతలవారీగా అసలు కడుతామని చెప్పింది. అంటే అప్పటివరకు అంకెల్లో రాష్ట్రాలపై రుణభారం కనిపిస్తుందన్నమాట. ఇది మార్కెట్‌లో రాష్ట్రాల పరపతిని దెబ్బతీస్తుంది. మరోవైపు జీఎస్టీ పరిహారం, ఎఫ్‌ఆర్బీఎంలో ఒక శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మేరకు అప్పు తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది.

తెలంగాణ ఎఫ్‌ఆర్బీఎంలో 1 శాతం అంటే సుమారు రూ.10వేల కోట్లు. రాష్ట్రానికి రావాల్సిన పరిహారం సైతం సుమారు రూ.10వేల కోట్లే. కేంద్రం చెప్పినట్టు మార్కెట్‌ నుంచి అప్పు తెచ్చుకొంటే తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు. పైగా మరోసారి రుణం తీసుకునే అవకాశం కోల్పోతుంది. రూ.10వేల కోట్లకు గండి పడుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నది.

Tags :

Advertisement