Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం ..మరి కొద్దీ గంటల్లో పోలింగ్ ప్రారంభం

దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం ..మరి కొద్దీ గంటల్లో పోలింగ్ ప్రారంభం

By: Sankar Tue, 03 Nov 2020 05:46 AM

దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం ..మరి కొద్దీ గంటల్లో పోలింగ్ ప్రారంభం


సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్‌ జరుగనున్నది. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది సోమవారం సాయంత్రమే చేరుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది.

ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సహా మొత్తం 23 మంది పోటీచేస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ దిశానిర్దేశం చేశారు. కరోనా కారణంగా హోంక్వారంటైన్‌లో ఉన్న 130 మందిలో 93 మంది ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

పోలింగ్‌ సమయం ముగియడానికి గంట ముందు కరోనా రోగులను ఓటు వేసేందుకు అనుమతిస్తారు. వీరికి ప్రత్యేక పీపీఈ కిట్లు అందించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతికదూరం పాటించేలా ప్రత్యేకంగా గుర్తులను వేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలు అందుబాటులో ఉంచారు. ప్రతి ఓటరును పరీక్షించిన తర్వాతనే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఓటర్లకు గ్లౌజ్‌లు, మాస్కులు, శానిటైజర్‌, సబ్బు, నీళ్లు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు.

జిల్లా ఎన్నికల అధికారి భారతి హోలికేరి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నియమనిబంధనలకు అనుగుణంగా దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాం. పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటుచేశాం. ప్రతిఒక్కరు ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకొనేలా చర్యలు తీసుకున్నాం అన్నారు

Tags :
|
|
|

Advertisement