Advertisement

  • విరాట్ కోహ్లీ రనౌట్‌పై స్పందించిన అజింక్య రహానె...!

విరాట్ కోహ్లీ రనౌట్‌పై స్పందించిన అజింక్య రహానె...!

By: Anji Fri, 25 Dec 2020 4:59 PM

విరాట్ కోహ్లీ రనౌట్‌పై స్పందించిన అజింక్య రహానె...!

అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ రనౌట్‌పై అజింక్య రహానె ఎట్టకేలకి స్పందించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఆ టెస్టులో విరాట్ కోహ్లీని తొలుత పరుగు కోసం పిలిచిన రహానె.. అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో.. అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లిపోయిన కోహ్లీ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ మ్యాచ్‌లో అప్పటి వరకూ ఆస్ట్రేలియా బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4).. నాలుగో వికెట్‌కి రహానెతో కలిసి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కానీ.. కోహ్లీ రనౌట్ తర్వాత టీమిండియా తడబడగా.. రహానె (42: 92 బంతుల్లో 3x4, 1x6) కూడా ఆ వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. మొత్తంగా.. కోహ్లీ రనౌట్ మ్యాచ్‌లో కీలక మలుపుగా అందరూ అభివర్ణించారు.

అడిలైడ్ టెస్టులో చివరికి ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకోగా.. కోహ్లీ రనౌట్‌కి కారణమైన అజింక్య రహానెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

కానీ.. ఈరోజు వరకూ మౌనంగా ఉన్న రహానె.. శనివారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు జరగనుండటంతో ఆ రనౌట్‌పై స్పందించాడు. విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులు తీసుకుని ఇప్పటికే భారత్‌కి వచ్చేయగా.. రెండో టెస్టుకి రహానె కెప్టెన్‌గా టీమిండియాని నడిపించనున్నాడు.

విరాట్ కోహ్లీ రనౌట్‌పై అజింక్య రహానె మాట్లాడుతూ ‘‘అది చాలా బాధాకరమైన ఘటన. అప్పటికి మ్యాచ్‌లో మేము మంచి స్థితిలో ఉన్నాము. ఇద్దరి మధ్య మెరుగైన భాగస్వామ్యం కూడా లభించింది. కానీ.. ఆ రనౌట్‌తో టీమిండియాకి మ్యాచ్‌పై పట్టుజారింది.

ఆరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీని క్షమించమని కోరాను.. అతను ఫర్వాలేదు అని సమాధానమిచ్చాడు. ఇద్దరం అప్పటి పరిస్థితిని అర్థం చేసుకున్నాం. అయినా.. క్రికెట్‌లో ఇలాంటివి చాలా సహజం’’ అని రహానె చెప్పుకొచ్చాడు.

Tags :

Advertisement