Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత వ్యాధి అవశేషాలు కనిపిస్తాయి .. ఎయిమ్స్‌ డైరెక్టర్‌

కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత వ్యాధి అవశేషాలు కనిపిస్తాయి .. ఎయిమ్స్‌ డైరెక్టర్‌

By: Sankar Fri, 28 Aug 2020 10:16 PM

కరోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత వ్యాధి అవశేషాలు కనిపిస్తాయి .. ఎయిమ్స్‌ డైరెక్టర్‌


కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో చాలాకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో ఎలాంటి లక్షణాలు ఎన్ని రోజుల పాటు ఉంటున్నాయో తెలుసుకునేందుకు సర్కారు క్లినికల్‌ ట్రయల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులను ఫాలోఅప్‌ చేస్తామని, సంవత్సరంలో ఎంతమందికి మళ్లీ దీని తాలూకు లక్షణాలు కనిపించాయో నమోదుచేస్తామన్నారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న ఆరునెలల తర్వాత చాలామందిలో వ్యాధి అవశేషాలు కనిపిస్తాయి. వారిలో అలసట, శరీర నొప్పులు ఉంటాయి. కొందరు 6-8 వారాల్లో కోలుకోవచ్చు, కొంతమందికి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని అవయవాలకు శాశ్వత నష్టం కూడా కలుగవచ్చు.’ అని అని డాక్టర్ గులేరియా వెల్లడించారు. ఎయిమ్స్‌ ఢిల్లీతోసహా అనేక ఆరోగ్య కేంద్రాలు పోస్ట్-కొవిడ్ కేర్ ఓపీడీలను ప్రారంభిస్తున్నాయని, ఇక్కడ కొవిడ్‌ వచ్చి తగ్గిపోయిన వారికి రెగ్యులర్‌గా పరీక్షలు చేస్తారని చెప్పారు.

కొంతమంది రోగులు గుండె పనితీరులో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారని, కొంతమందికి ఇంట్లో ఆక్సిజన్ అవసరమవుతోందని చెబుతున్నారన్నారు. ఈ రోగులను దీర్ఘకాలికంగా పరీక్షించాల్సిన అవసరముందని తెలిపారు. ‘వైరస్‌ కొత్తది. దీని ప్రభావం చాలాకాలం ఉంటుంది. కావున మేం రోగులను తరుచూ పరీక్షిస్తుండాలి. డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలి. ఇది ఐసీఎంఆర్‌, ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది.’ అని ఆయన వెల్లడించారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో టీకా వస్తుందని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement