Advertisement

  • మొక్కజొన్న సాగుకు విరామం ఇవ్వాలని కోరిన వ్యవసాయశాఖ అధికారులు

మొక్కజొన్న సాగుకు విరామం ఇవ్వాలని కోరిన వ్యవసాయశాఖ అధికారులు

By: chandrasekar Tue, 23 June 2020 7:10 PM

మొక్కజొన్న సాగుకు విరామం ఇవ్వాలని కోరిన వ్యవసాయశాఖ అధికారులు


వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందేలా రైతును చైతన్యపరిచేందుకు ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని ఆచరణలోకి తెచ్చింది. దీనికోసం వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితి ప్రతినిధులు గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించారు.

వానాకాలంలో మొక్కజొన్న సాగుకు ప్రభుత్వం విరామం ప్రకటించిందని వివరిస్తూ అందుకు గల కారణాల పై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించింది. ఇంతేకాకుండా విత్తన విక్రయ దుకాణాల్లో మొక్కజొన్న విక్రయాలు చేపట్టొదని వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే సీడ్‌యాక్ట్‌ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ ప్రభుత్వ సూచనలతో రైతు ఆలోచనలో మార్పు వచ్చినప్పటికీ వ్యాపారుల ధోరణిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు.

రహస్యంగా నిల్వలు చేసుకున్న వ్యాపారులు అదనపు ధరలతో విత్తనాలను రైతు ఇంటికి చేర్పించారు. దీంతో ఇప్పటికే యాభైశాతం మించి మొక్కజొన్నను రైతులు వేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల ఆలోచనకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడం, పంటను కూడా అదే వ్యాపారికి విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది. స్వరాష్ట్రంలో ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నప్పటికీ వ్యాపారుల హెచ్చరికలకు భయపడి వారి నుంచి పెట్టుబడులను తీసుకుంటూ వస్తున్నారు.

పత్తి, మిర్చి పంటలు సాగుచేయాలంటే పెట్టుబడులు అధికంగా ఉంటాయని, శ్రమ కూడా అధికంగా ఉంటుందని, అవసరమైన సమయంలో కూలీల కొరతను అధిగమించలేరంటూ వ్యాపారులు రైతులను గందరగోళపరుస్తూ నియంత్రిత సాగుకు తూట్లు పొడుస్తున్నారు. ఆయా పంటలు సాగు చేసిన దిగుబడులు వచ్చిన సమయంలో ఆశించిన ధర లేకుంటే ఎలాగంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వానాకాలంలో మొక్కజొన్న సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఏజెన్సీ గ్రామాల్లో విత్తన డీలర్లు ముందుస్తుగా రహస్యంగా నిల్వ చేసుకున్న మొక్కజొన్న విత్తనాలను లాభాపేక్షతో రైతులకు అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించారు. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు దళారులు ఏజెన్సీలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు, తనిఖీ బృందాల కంటే మిన్నగా పగలూ రాత్రి తేడా లేకుండా వ్యాపారులపై ప్రత్యక్ష దాడులు ప్రారంభించారు. వ్యాపారులు దళారుల డిమాండ్‌కు తలొగ్గి ఆ భారాన్ని రైతులపై వేస్తున్నారు. మాట వినని వ్యాపారులపై తనిఖీ బృందాలను ప్రయోగించి తమ దారికి తెచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :
|

Advertisement