హైదరాబాద్ లో మళ్ళీ భారీ వర్షం..అధికారుల సహాయక చర్యలు
By: Sankar Mon, 28 Sept 2020 3:50 PM
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గత వారంలో నాలుగైదు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. శనివారం రాత్రి వరకు వాన దంచికొట్టింది. ఆదివారం వాన లేకపోయినప్పటికీ చల్లని గాలులు వీచాయి. అక్కడక్కడ కాస్త ఎండ కనిపించింది.
ఈ నెల 28న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం విదితమే. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.