Advertisement

నకిలీ ఎసిబీ ముఠా గుట్టురట్టు

By: Dimple Thu, 10 Sept 2020 11:01 AM

నకిలీ ఎసిబీ ముఠా గుట్టురట్టు

ఏసీబీ అధికారులమంటూ జిల్లాలోని పలు అధికారులను టార్గెట్‌ చేసి వారినుంచి తమ ఖాతాల్లోకి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న ముఠా నుంచి రాబట్టిన సమాచారంతోనే జిల్లాలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగినట్టు తేటతెల్లమైంది. కర్నూలు జిల్లాలో ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ శ్రీనాథ్‌రెడ్డి ముఠా ఈనెల 1న అక్కడి పోలీసులకు పట్టుబడింది.
గత జూన్‌ నుంచి నకిలీ ఏసీబీ అధికారులకు, జిల్లాలోని పలువురు అధికారులకు మధ్య సాగిన లావాదేవీలు, ఫోన్‌కాల్‌ సంభాషణలు ఇప్పుడు ఏసీబీకి ‘కీ’లకమైన ఆధారాలయ్యాయి. నకిలీ ఏసీబీ ముఠా పట్టుబడడంతో గుట్టుగా సాగుతున్న అధికారుల బాగోతం బట్టబయలైంది. ఫేక్‌ ఏసీబీకి నగదు ముట్టజెప్పినవారు రాష్ట్రంలో 60మందికిపైగా ఉండగా జిల్లాలో చిత్తూరు ఆర్‌అండ్‌బీ ఈఈ చంద్రశేఖర్‌ రూ.2లక్షలు, ఇరిగేషన్‌ డిప్యూటీ ఎస్‌ఈ కృష్ణమూర్తి రూ.1.5 లక్షలు, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి రూ.3.49 లక్షలు సమర్పించుకున్నట్టు తేలింది.
పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి గత ఏడాది ఎర్రగుంట్ల మున్సిపాలిటీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈనెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూలై మొదటివారంలో ఆయనకు విజయవాడ ఏసీబీ అధికారినంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘మీ అక్రమాల చిట్టా మొత్తం మావద్ద ఉంది. మేం చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం పోవడమేకాదు, బెనిఫిట్స్‌ కూడా రాకుండా జైలుకెళ్తారు’’ అంటూ బెదరగొట్టినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో కూడా చెప్పడంతో చేసేదిలేక వారి చెప్పిన ఖాతాలకు డబ్బులు జమచేశారని తెలిసింది.

ఫేక్‌ ఏసీబీ ముఠాలో ఓ వ్యక్తి సీఐగా ఫోన్‌ చేయడం.. తరచూ తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ చేసేవాడని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. తన కుమార్తె అమెరికాలో ఉందనే విషయం కూడా చెప్పారని తెలిపారు. రిటైర్డ్‌ స్టేజ్‌లో ఎందుకొచ్చిన∙సమస్య అనుకుని తాను వారి ఖాతాల్లోకి డబ్బు వేశానని చెప్పుకొచ్చారు. జరిగిన వ్యవహారాన్ని బట్టి ఫేక్‌ ఏసీబీ ముఠా అధికారులు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని టార్గెట్‌ చేసినట్లు బోధపడుతోంది.

Tags :
|
|
|
|

Advertisement