Advertisement

రవాణాశాఖ ఆధ్వర్యంలో ‘అభయం’ యాప్...‌

By: chandrasekar Tue, 24 Nov 2020 11:43 AM

రవాణాశాఖ ఆధ్వర్యంలో ‘అభయం’ యాప్...‌


సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభయం ప్రాజెక్టును ప్రారంభించారు. ఆటోలు, టాక్సీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతకోసం రూపొందించిన ప్రాజెక్టు. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యమిస్తోందో చెప్పేందుకు అభయం ప్రాజెక్టు రూపకల్పనే నిదర్శనమని ఈ సందర్భంగా జగన్‌ అన్నారు. ‘‘రవాణాశాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో పిల్లలు, మహిళలు నిర్భయంగా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో వారికి ఏ ఆపద రాకుండా చూసుకోవడం కోసం అభయం ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఆటో, టాక్సీలో ట్రాకింగ్‌ వ్యవస్థ అమరుస్తాం’’ అని వివరించారు. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నవంబరు నాటికి లక్ష వాహనాలకు అమరుస్తామని తెలిపారు. ఆటోలు, టాక్సీ డ్రైవర్లపై నమ్మకంలేక కాదని, వాటిలో ప్రయాణించేవారికి డ్రైవర్లపై మరింత నమ్మకం పెంచడం కోసమే ఈ ఏర్పాటు చేశామని వివరించారు. ‘‘మన వాళ్లంతా ఓలా, ఉబర్‌ వంటి బహుళజాతి సంస్థలు నడిపే టాక్సీలతో పోటీ పడుతున్నారు. మహిళలకు మనోధైర్యం ఇవ్వడానికీ, మన ఆటోలు, మన టాక్సీలపై ఒక నమ్మకం ఏర్పడటానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే ఆదేశాలు ఇచ్చానని ఆయన గుర్తుచేశారు. కాగా, పిల్లలు, మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశచట్టం, సైబర్‌మిత్ర, మహిళా మిత్ర తాజాగా అభయం యాప్‌ అందులో భాగమేనన్నారు. ఏపీ అంటే మహిళలకు అభయహస్తం అన్నట్టు సీఎం చర్యలు తీసుకొంటున్నారని పేర్కొన్నారు.

ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించేవారు తమ మొబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘అభయం’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వాహనం ఎక్కేముందు దానికి అంటించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. స్కాన్‌ చేయగానే డ్రైవరు ఫొటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. ఆ తర్వాత తాము వెళుతున్న ప్రాంతం వివరాలు నమోదు చేయాలి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. స్టార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని పానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతుంది. క్యాబ్‌ ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్‌ అఽధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు.

ఏమిటీ ప్రాజెక్టు?...

అభయం ప్రాజెక్టు వ్యయం రూ. 138.48 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీమ్‌లో భాగంగా 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా రూ. 55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్ష రవాణా వాహనాలకు ట్రాకింగ్‌ ఉపకరణాలు (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌-ఐవోటీ) బిగించి వచ్చేఏడాది నవంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలుచేయాలని రవాణాశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. విశాఖపట్నంలో ఇప్పటికే పైలెట్‌గా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. యాప్‌ను ప్రారంభించిన తొలిరోజునే వెయ్యి ఆటోల్లో ఐవోటీ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది నవంబరు నాటికి విశాఖతోపాటు, విజయవాడ, తిరుపతిలో లక్ష వాహనాల్లో ట్రాకింగ్‌ డివైజ్‌లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఐదు వేల వాహనాలు, జూలై 1 నాటికి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి పూర్తిస్థాయి లక్ష్యాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. 2025 వరకు ఈ ప్రాజెక్టు అమల్లో ఉంటుంది. ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చిన తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ(ఆర్‌ఎ్‌ఫఐడీ) కార్డులు జారీచేస్తారు. ఈ కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే వాహనాలు స్టార్ట్‌ అవుతాయి.

పథకం పాతదే

ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ప్రత్యేక ప్రాజెక్టును 2018లోనే కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అప్పుడూ ఈ ప్రాజెక్టు పేరు ‘అభయమే’. పైలెట్‌గా విజయవాడలోనే దీనిని తొలిసారి కేంద్రం అమలు చేసింది. అందులో భాగంగా 50 ఆటోలకు ఐవోటీ ఉపకరణాలను అమర్చారు. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు, పిల్లలు ఈ ఉపకరణంలో ఉన్న ప్యానిక్‌ బటన్‌ నొక్కగానే పోలీసులకు సమాచారం వెళ్లాల్సి ఉండగా, ఆర్టీయేకి వెళ్లేది. బటన్‌ నొక్కగానే ఆర్టీయేకి కాకుండా పోలీసులకు సమాచారం వెళ్లేలా మార్పులు చేసి అమలు చేయాలని కేంద్రం భావించింది. ఈ మేరకు సూచనలు చేసి అవి అమల్లోకి రాకముందే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఆ పథకంలో ఉన్న లోపాలనే సవరించి ఇప్పుడు కొత్తది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి అయ్యే వ్యయంలో అధిక వాటా కేంద్రానిదే కావడం గమనార్హం!

Tags :
|

Advertisement