Advertisement

తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు

By: chandrasekar Sat, 13 June 2020 8:34 PM

తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు


రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లలో ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మన రాష్ట్రంలో అడుగుపెట్టింది. కరోనా మహమ్మారితో తీవ్ర ముప్పు నెలకొని ఉన్న నేపథ్యంలో దేశంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి గత నెలలోనే ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను, పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు.

మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మిడతలు ప్రవేశించి పంటలను నాశనం చేస్తుండగా తదుపరి ఎక్కడ ప్రవేశిస్తాయనేది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాధికారులు అప్రమత్తతో తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Advertisement