Advertisement

  • ఓ మహిళ సాధించిన ఘన విజయం.. ఆ ఊరి గొంతును తడిపింది

ఓ మహిళ సాధించిన ఘన విజయం.. ఆ ఊరి గొంతును తడిపింది

By: chandrasekar Tue, 27 Oct 2020 11:48 AM

ఓ మహిళ సాధించిన ఘన విజయం.. ఆ ఊరి గొంతును తడిపింది


మధ్యప్రదేశ్‌లోని చిన్న ఊరు ఘట్‌గరా. ఇరవై ఏండ్ల క్రితం, ఆ ఊరి కోడలుగా అడుగుపెట్టింది మాయా మౌసరియా. వచ్చిన రోజే అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయింది. గ్రామ మహిళలు, బిందెలు పట్టుకుని చాలా దూరం నడిచి వెళ్లాలి. రోజూ ఇంటికి సరిపడా నీళ్లు తెచ్చుకునేసరికే, సగం రోజు గడిచిపోయేది. ఇండోర్‌కు సమీపంలోని గ్రామం నుంచి వచ్చిన మౌసరియాకి ఇది చాలా మూర్ఖంగా అనిపించింది. గ్రామ సర్పంచిగా ఎవరు వచ్చినా, ఆ సమస్యని పరిష్కరించకపోవడం చూసి గుండె నీరుగారింది. గత సర్పంచులంతా మగవాళ్లు కావడమే ఆ నిర్లక్ష్యానికి కారణం అని తెలుసుకుంది. తల మీద బిందెలు పెట్టుకుని, కిలోమీటర్ల కొద్దీ నడిస్తే కలిగే వైరాగ్యం మోసేవాళ్లకే తెలుస్తుంది. అందుకే తనే స్వయంగా పరిస్థితులను సరిచేయాలనుకుంది.

2014లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో, సర్పంచిగా పోటీ చేసింది. మహిళలంతా మౌసరియాకే ఓటు వేశారు. ఊరి చరిత్రలో తొలి మహిళా సర్పంచిగా ఆమె ఎన్నికైంది. పదవిలోకి రాగానే మౌసరియా చేసిన మొట్టమొదటి పని, ఊళ్లో రెండు బావులు తవ్వించి ఓ వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించడం. ఆ కాస్త పనికే చాలామంది సంబరపడిపోయారు, కానీ మౌసరియా మాత్రం తృప్తిపడలేదు.

‘ఇంటింటికీ కొళాయి కోసం ప్రభుత్వం చాలా పథకాలే ప్రారంభించింది కదా, మరి ఆడవాళ్లు బావుల చుట్టూ మూగడం ఎందుకు?’ అనుకుంది. కానీ ఆమె ఊళ్లో అలాంటి పథకాలు ‘పారలేదు’. మంచినీటి పథకం అమలు కోసం పదేపదే తహసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగింది. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకి నడిచి వెళ్లేది. భర్తేమో చనిపోయాడు. తన కొడుకు తప్ప, గ్రామం నుంచి మరో వ్యక్తి ఆమెకు సాయంగా వచ్చేవారే కాదు. పైగా ఆమె శ్రమకు వంకలు పెట్టేవాళ్లూ.. పని చెడగొట్టేవాళ్లే ఎక్కువ. అయినా సరే, అనుకున్నది సాధించింది. ఇంటింటికీ కొళాయి కనెక్షన్లను మంజూరు చేయించింది. మంచినీళ్లు మాత్రమే కాదు గ్రామంలో అవసరం అయిన ప్రతి చోటా రోడ్లు వేయించింది, ఊళ్లో పాఠశాలలను బాగుచేయించింది.

మౌసరియా స్ఫూర్తిగా గ్రామంలోని మిగతా మహిళలు కూడా ఇప్పుడు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవడం మొదలుపెడుతున్నారు. గ్రామసభకు ఆమడదూరంలో ఉండేవాళ్లు ఇప్పుడు ముందువరుసలో కూర్చుంటున్నారు. ఘట్‌గరా గ్రామం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రజల జీవితాలు సాఫీగా గడిచిపోతున్నాయి. అలాగని మౌసరియా తన బాధ్యత పూర్తయిందనుకోలేదు. ‘పొరుగూరిలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లాలంటే, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. త్వరలోనే వాళ్ల కోసం ఓ ప్రభుత్వ బస్సును ఏర్పాటు చేయించే పనిలో ఉన్నాను’ అంటున్నారు మౌసరియా.

Tags :

Advertisement