Advertisement

మెద్వెదేవ్‌కు ఎదురుదెబ్బ

By: chandrasekar Wed, 30 Sept 2020 8:26 PM

మెద్వెదేవ్‌కు ఎదురుదెబ్బ


హార్డ్‌ కోర్టులపై అద్భుతంగా ఆడే రష్యా యువతార డానిల్‌ మెద్వెదేవ్‌ ఎర్రమట్టి కోర్టులపై మరోసారి తేలిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ వరుసగా నాలుగో ఏడాదీ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 63వ ర్యాంకర్‌ మార్టన్‌ ఫుచోవిచ్‌ (హంగేరి) 6–4, 7–6 (7/3), 2–6, 6–1తో మెద్వెదేవ్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫుచోవిచ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) అలవోక విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్‌ 6–0, 6–2, 6–3తో మికెల్‌ వైమెర్‌ (స్వీడన్‌)ను ఓడించాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది 32వ విజయం కావడం విశేషం. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 13వ సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) 3 గంటల 17 నిమిషాల్లో 6–7 (5/7), 5–7 (4/7), 7–5, 6–4, 6–3తో స్యామ్‌ క్వెరీ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయిన రుబ్లెవ్‌ ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని నెగ్గడం విశేషం.

6 గంటల 5 నిమిషాల్లో...

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతోన్న ఇటలీ క్వాలిఫయర్‌ ఆటగాడు లొరెంజో గస్టినో అద్భుతం చేశాడు. 6 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మారథాన్‌ మ్యాచ్‌లో గస్టినో 0–6, 7–6 (9/7), 7–6 (7/3), 2–6, 18–16తో కొరెంటిన్‌ ముతె (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోకి చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. 2004 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అర్నాడ్‌ క్లెమెంట్, ఫాబ్రిస్‌ సాంతోరో మ్యాచ్‌ 6 గంటల 33 నిమిషాలు జరిగింది. ముతె, గస్టినో మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 బ్రేక్‌ పాయింట్లు నమోదయ్యాయి. గస్టినో 96, ముతె 88 అనవసర తప్పిదాలు చేశారు. చివరి సెట్‌ ఒక్కటే 3 గంటల 29 నిమిషాలు సాగడం విశేషం.

Tags :
|
|

Advertisement