Advertisement

పశ్చిమబెంగాల్‌లో అరుదైన ఘటన

By: chandrasekar Sat, 27 June 2020 1:22 PM

పశ్చిమబెంగాల్‌లో అరుదైన ఘటన


పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అనుపమ్ దత్త, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమేన్ దాస్‌లు ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ వల్ల ఆమెలో పురుష లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

ఆమె 30 ఏళ్లుగా మహిళగానే జీవించింది. పదేళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు మాత్రం పుట్టడం లేదు. దీంతో భార్యభర్తలు ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక తన జీవితం ఇంతే అనుకుని కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఆమెకు పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడింది. దీంతో ఆమె భర్త వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాడు. వైద్య పరీక్షల్లో ఆమె మహిళ కాదని, పురుషుడని తేలింది. ఆమె వృషణ క్యాన్సర్ తో బాధపడుతోందని తెలిసింది. దీంతో ఆమె భర్త షాకయ్యాడు.

ఆమె బాల్యం నుంచి అమ్మాయిలాగానే పెరిగింది. శరీరం కూడా అమ్మాయిలాగే మారింది. మహిళల తరహాలోనే వక్షోజాలు కూడా పెరిగాయి. ఆమె మాట కూడ మహిళ గొంతులాగానే ఉండేది. మహిళల తరహాలోనే మర్మాంగాలు ఉన్నాయి. అయితే, వైద్య పరీక్షల్లో అవి పురుషుడి ఉండే మర్మాంగమేనని, అరుదైన కారణాల వల్ల బయటకు ఉండాల్సి వృషణాలు ఆమె శరీరంలోకి చొచ్చుకుని ఉన్నాయని వైద్యులు తెలిపారు.

డాక్టర్ దత్తా మాట్లాడుతూ ‘‘పొత్తి కడుపులో నొప్పని చెప్పడంతో వైద్య పరీక్షలు చేశాం. ఆమె కడుపులో వృషణాలు కనిపించాయి. బయోప్సీ పరీక్షల్లో ఆమెకు వృషణ క్యాన్సర్ అని తెలిసింది. దీన్నే వైద్య పరిభాషలో సెమినోమా అని కూడా అంటారు. ఆమెకు క్రోమోజోమ్‌ల పరీక్ష చేపట్టగా పురుషులకు ఉండే XY అని తేలింది. మహిళల క్రోమోజోమ్‌లు XX’’ అని తెలిపారు. 28 ఏళ్ల ఆమె సోదరికి కూడా వైద్యులు పరీక్షలు చేయగా ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ అని తేలింది.

వీరి మేనత్తల్లో కూడా ఈ సమస్య ఉందని, వారి జీన్స్ వల్లే వీరికి కూడా అది సంక్రమించిందని వైద్యులు తెలిపారు. ఈ సిండ్రోమ్ వల్ల మర్మాంగాలు శరీరంలోకి కుచించుకుపోతాయి. వారి హార్మోన్ల ప్రభావం వల్ల శరీరం మహిళల తరహాలో వృద్ధి చెందుతుంది. వైద్యులు ఆమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది అరుదైన ఆరోగ్య సమస్యని, ప్రతి 22 వేల మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు తెలిపారు. ఆమెను మహిళగా చూడాలని, ఎప్పటిలాగానే కలిసి ఉండాలని ఆమె భర్తకు సూచించారు.

Tags :
|
|
|

Advertisement