Advertisement

  • పూణే నుంచి జంషెడ్‌పూర్‌ వరకు 1,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించిన తల్లి

పూణే నుంచి జంషెడ్‌పూర్‌ వరకు 1,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించిన తల్లి

By: chandrasekar Wed, 29 July 2020 8:11 PM

పూణే నుంచి జంషెడ్‌పూర్‌ వరకు 1,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించిన తల్లి


కరోనా లాక్‌డౌన్‌ వల్ల నిరుద్యోగంలో ఉన్న 26 ఏళ్ల మహిళ విమానం ఎక్కే స్థోమత లేక అనారోగ్యంతో ఉన్న తన ఐదేళ్ల కుమారుడిని కలవడానికి పూణే నుంచి జంషెడ్‌పూర్‌ వరకు ఐదు రోజుల పాటు బైక్‌పై ప్రయాణం చేసింది. కద్మాలోని భాటియా బస్తీ నివాసి అయిన సోనియా దాస్ ఆమె స్నేహితురాలు సబియా బానోతో కలిసి పూణే నుంచి ముంబై మీదుగా సుమారు 1,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం సాయంత్రం జంషెడ్‌పూర్‌కు చేరుకుంది.

తన కుమారుడికి జ్వరం వచ్చిందని ఆమె భర్త తెలియజేయడంతో వారు సోమవారం ఉదయం పూణే నుంచి బయల్దేరినట్లు తెలిపారు. వీరిద్దరూ శుక్రవారం స్టీల్ సిటీకి చేరుకోగానే అధికారులు వారికి కరోనా పరీక్షలు చేశారు. నెగిటీవ్‌గా నిర్ధారణ అయిన తరువాత వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించినట్లు డీఎస్పీ అరవింద్‌కుమార్‌ టైమ్స్‌ఆఫ్‌ ఇండియాతో అన్నారు.

ఈ కుటుంబానికి 30 రోజులకు సరిపడా నిత్యావసరాలను కూడా అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు సాయం చేయాల్సిందిగా మహారాష్ట్ర, జార్ఖండ్‌ ప్రభుత్వాలకు చాలాసార్లు ట్వీట్ల ద్వారా అభ్యర్థించానని, టాటానగర్, పూణే, ముంబై మధ్య ప్యాసింజర్ రైళ్లు నడపడం లేదని, విమానంలో వెళ్దామంటే టికెట్ కొనడానికి తగినంత డబ్బు తనవద్ద లేదని సోనియా తెలిపింది.

జ్వరం వచ్చిందని తెలియగానే తన కుమారుడిని చూడాలని తాను చాలా బాధపడ్డానని చేసేది లేక తన స్నేహితురాలితో కలిసి బైక్‌పై రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు సోనియా తెలిపింది. ముంబైలోని ఒక ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న సోనియా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం కోల్పోయింది. అద్దె చెల్లించలేదని ముంబైలో ఆమె ఉంటున్న హాస్టల్‌ నుంచి బయటికి పంపారు.

ఆమె ఉద్యోగ ప్రయత్నాల కోసం పూణే వెళ్లింది. అక్కడ తన స్నేహితురాలు సబియా ఇంట్లో ఉంటుంది. కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తరువాత అక్కడి నుంచి తన స్నేహితురాలితో కలిసి జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు బైక్‌పై వచ్చింది. దారిలో పది పెట్రోల్ బంకులు, మూడు దాబాల వద్ద ఆగి బస చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రయాణంలో ఎలాంటి అభద్రతా సమస్యలను ఎదుర్కోలేదని వారు పేర్కొన్నారు. తన కుమారుడిని చూసిన తరువాతే తనకు ఆనందం కలిగినట్టు తెలిపింది.

Tags :
|
|

Advertisement